అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల డిగ్రీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. యూజీ విద్యార్థులు త్వరలో డిగ్రీ కోర్సుల వ్యవధిని తగ్గించుకునే, పొడిగించుకునే ఆప్షన్‌ను పొందుతారని యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు. యూజీ విద్యార్థులకు తమ డిగ్రీ ప్రోగ్రామ్‌ల వ్యవధిని వారి అభ్యాస సామర్థ్యం ఆధారంగా తగ్గించడం లేదా పొడిగించే విధంగా ఉన్నత విద్యా సంస్థలు త్వరలో ఒక ఆప్షన్‌ను తీసుకురానున్నట్లుగా పేర్కొన్నారు.
“విద్యార్థులు వారి అభ్యాస సామర్థ్యాల ఆధారంగా వారి డిగ్రీ కోర్సు వ్యవధిని తగ్గించడం, పొడిగించుకునే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. యాక్సిలరేటెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ (ఏడీపీ) ద్వారా ప్రతి సెమిస్టర్లో అదనపు క్రెడిట్స్‌ను సంపాదించడం ద్వారా తక్కువ సమయంలో మూడు లేదా నాలుగేళ్ల డిగ్రీ కోర్సును పూర్తి చేయవచ్చు. అయితే ఎక్స్టెండెడ్ డిగ్రీ ప్రోగ్రామ్(ఈడీపీ)తో డిగ్రీ కాలవ్యవధిని పెంచుకోవచ్చు. ప్రతి సెమిస్టర్లో తక్కువ క్రెడిట్స్ వచ్చినవారికి ఈ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఏడీపీ, ఈడీపీ ప్రోగ్రామ్‌లకు విద్యార్థుల అర్హతను అంచనా వేయడానికి ఉన్నత విద్యాసంస్థలు కమిటీలను ఏర్పాటు చేస్తాయి. ఈ డిగ్రీలతో అన్ని ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సాధారణ డిగ్రీల్లానే వీటికి విలువ ఉంటుంది.” అని యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు.