ప్రముఖ గాయని ఉషా ఊతుప్ భర్త జానీ చాకో ఊతుప్ హఠాన్మరణం చెందారు. సోమవారం రాత్రి కోల్ కతాలోని తమ నివాసంలో టీవీ చూస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. గుండె నొప్పితో విలవిల్లాడుతున్న జానీ చాకోను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన తుదిశ్వాస వదిలారని ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. జానీ చాకోకు ప్రస్తుతం 78 ఏళ్లు.. జానీ చాకో ఊతుప్, ఉషా ఊతుప్ దంపతులకు ఇద్దరు సంతానం.. కుమారుడు సన్నీ, కుమార్తె అంజలి.
తండ్రి హఠాన్మరణంపై అంజలి సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ‘నాన్నా.. మమ్మల్ని వదిలేసి చాలా త్వరగా వెళ్లిపోయావు. ఎంతో స్టైలిష్‌గా జీవించావు. ప్రపంచంలో అత్యంత అందమైన మనిషివి. నిన్ను మేము ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం’ అని ఆ పోస్ట్ లో రాసుకొచ్చారు. జానీ చాకో మరణంతో ఉషా ఊతుప్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన అంత్యక్రియలు మంగళవారం జరగనున్నట్లు సమాచారం.
సంగీత ప్రపంచంలో ఉషా ఊతుప్ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. సంగీతంలో ఆమె చేసిన కృషికి గానూ ఉషా ఊతుప్ ను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 1971లో ‘హరేరామ హరేకృష్ణ’ సినిమాలోని పాటతో గుర్తింపు తెచ్చుకున్న ఉషా ఊతుప్ తెలుగుతో పాటు మొత్తం 15 భాషల్లో పాటలు పాడారు. అల్లు అర్జున్ సినిమా రేసుగుర్రం టైటిల్ సాంగ్ ను ఉషా ఊతుప్ పాడారు.