కొన్నిసార్లు సాధారణ అంశాలే భార్యాభర్తల మధ్య వివాదానికి దారితీయడం, క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతుండడం తెలిసిందే. ఈ ఘటన కూడా అలాంటిదే. మహారాష్ట్రలో ఓ యువకుడు భార్య చీరకట్టు నచ్చక బలవన్మరణం చెందాడు.
అతడి పేరు సమాధాన్ సాబ్లే. ఔరంగాబాద్ లోని ముకుంద్ నగర్ నివాసి. 24 ఏళ్ల సమాధాన్ సాబ్లే సోమవారం నాడు తన నివాసంలో విగతజీవుడిగా కనిపించాడు. అతని గది నుంచి పోలీసులు సూసైడ్ లెటర్ ను స్వాధీనం చేసుకున్నారు. తన భార్య వైఖరితో విసిగిపోయానని, ఆమెకు సరిగా చీరకట్టుకోవడం తెలియదని సమాధాన్ సాబ్లే తన లేఖలో పేర్కొన్నాడు. ఆమెకు సరిగా నడవడం తెలియదని, సరిగా మాట్లాడడం అంతకన్నా తెలియదని వాపోయాడు.
సమాధాన్ కు ఆరు నెలల కిందటే పెళ్లయింది. భార్య అతడి కంటే ఆరేళ్లు పెద్దదని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.