ధనవంతులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తుంటారు? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ విడుదల చేసిన తాజా నివేదికను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. మన దేశంలోని మహా ధనవంతులు తమ మొత్తం పెట్టుబడుల్లో అధిక మొత్తాన్ని ఈక్విటీలు (షేర్లు), రియల్ ఎస్టేట్, బాండ్లకు కేటాయిస్తున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది.
ముఖ్యంగా ఈక్విటీల్లో 34 శాతం పెట్టుబడులు పెడుతున్నారు. ఆ తర్వాత వాణిజ్య రియల్ ఎస్టేట్ ఆస్తుల్లో 25 శాతం ఇన్వెస్ట్ చేస్తున్నారు. నేరుగా లేదంటే ఫండ్స్, రీట్స్ రూపంలో ఈ పెట్టుబడులు చేస్తున్నారు. వాణిజ్య రియల్ ఎస్టేట్ కూడా ప్రాధాన్య పెట్టుబడి సాధనంగా మారిపోయిందని, భారత వృద్ధి పట్ల విశ్వాసానికి దీన్ని నిదర్శనంగా నైట్ ఫ్రాంక్ నివేదిక పేర్కొంది. అనిశ్చిత పరిస్థితుల్లో కొంచెం స్థిరత్వానికి అనుకూలంగా ఉండే బాండ్లలో 16 శాతం పెట్టుబడులు కలిగి ఉన్నారు.
ఒక్కో అధిక ధనవంతుడు/ధనవంతురాలు వద్ద ఐదు ఇళ్లు ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా అధిక ధనవంతులు ఒక్కొక్కరి వద్ద ఉన్నది నాలుగు ఇళ్లే. గతేడాది 14 శాతం అధిక ధనవంతులు భారత్ లో కనీసం ఒక ఇల్లు అయినా కొనుగోలు చేయగా, ఈ ఏడాది 10 శాతం మంది ఇల్లు కొనుగోలు చేస్తారని ఈ నివేదిక అంచనా వేసింది.