ఢిల్లీ : నేరచరిత ప్రజా ప్రతినిధుల కేసుల విచారణ మళ్లీ వాయిదా పడింది. ఈ కేసు విచారణను త్వరిత గతిన చేపట్టాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణను సుప్రీం వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న కేసుల జాబితాలు, వాటిలో తీవ్రత ఉన్న కేసులు, గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల తర్వాత పురోగతిపై ఇప్పటికే అమికస్ క్యూరీ నివేదిక దాఖలు చేసింది. తీవ్ర నేరాభియోగాలు ఉన్న వ్యక్తులు ఎన్నికలకు దూరంగా ఉంచాలని, పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించాలని, నేర నేపథ్యం ఉన్న వారిని కూడా ఎన్నికలకు దూరంగా ఉంచేలా చట్టం తీసుకురావాలంటూ దాఖలైన ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ రోజు పలు ముఖ్యమైన కేసుల విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో వారం రోజులపాటు ఈ కేసు విచారణను వాయిదా వేస్తున్నట్లు సీజేఐ జస్టిస్ చంద్ర చూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది.