న్యూఢిల్లీ: పోలవరం కేసులో ఏపీ ప్రభుత్వాని(AP Government)కి సుప్రీం కోర్టు (Supreme court) షాక్ ఇచ్చింది. పోలవరం, పురుషోత్తపట్నం, పట్టిసీమ ప్రాజక్టుల నిర్మాణంలో ఎన్జీటీ సంయుక్త కమిటి((NGT Joint Committee) విధించిన నష్టపరిహారాన్ని వెంటనే జమ చేయాలని ఏపీ సర్కార్‌ను ఉన్నతన్యాయస్థానం ఆదేశించింది.ఎన్జీటీ (NGT) ఇచ్చిన తీర్పులో నష్టపరిహారం అంశం మినహా… మిగిలిన అన్ని అంశాలను యదాతథంగా అమలు చేయాల్సిందే అని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎన్జీటీ విధించిన రూ.250 కోట్ల నష్టపరిహారంపై తదుపరి విచారణ కొనసాగిస్తామని ఏపీ ప్రభుత్వానికి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ జెకె మహేశ్వరి ధర్మాసనం తెలిపింది. అప్పటి వరకు ఎన్జీటీ తీర్పులోని మిగిలిన అంశాలను అమలు చేయాల్సిందేనని ధర్మాసనం తేల్చి చెప్పింది.పోలవరం ప్రాజక్టు నిర్మాణంలో పర్యావరణ అనుమతుల ఉల్లంఘనపై జాతీయ హరిత ట్రైబ్యునల్ విధించిన జరిమానాను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. పర్యావరణ అనుమతుల ఉల్లంఘనపై ఎన్జీటీ సంయుక్త కమిటి సిఫారసులను యదాతథంగా అమలు చేయాలని ఏపీ సర్కార్‌ను సుప్రీం ఆదేశించింది. పర్యావరణానికి జరిగిన నష్టంపై సంయుక్త కమిటి సిఫారసు చేసిన జరిమానాను వెంటనే జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పురుషోత్తపట్నంకు రూ.2.48 కోట్లు, పట్టిసీమకు రూ.1.90 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని ఎన్జీటీ సంయుక్త కమిటి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు… తదుపరి విచారణ వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా వేసింది.