- ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
- ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం
పటాన్చెరు : స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములు చేస్తూ విజయవంతం చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి అధికారులను, ప్రజా ప్రతినిధులను ఆదేశించారు.
స్వచ్ఛ సర్వేక్షన్ 2023 అమలుపై మంగళవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో కార్పోరేటర్లు, జిహెచ్ఎంసి, విద్యుత్తు, పోలీసు, హెచ్ఎండబ్లుఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. జిహెచ్ఎంసి పరిధిలోని పటాన్చెరు, రామచంద్రాపురం, భారతీ నగర్ డివిజన్ల పరిధిలోని ప్రతి కాలనీలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేస్తూ స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ప్రధానంగా ప్రతి ఇంటి నుండి చెత్తను సేకరించడం, బహిరంగంగా వ్యర్థాలు పారవేయకుండా చూడడం, చెత్త వేసే ప్రదేశాలను గుర్తించడం, మురిగినీటి కాలువలు, నాళాల చుట్టూ ఫెన్సింగ్లు వేయడం, స్వచ్ఛ వార్డులు గుర్తించడం లాంటి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. స్వచ్ఛతలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే కాలనీలకు అవార్డులు అందించాలని కోరారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ కనెక్షన్లు సరి చూడడం, పాత స్తంభాల స్థానంలో నూతన స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరారు. పోలీస్ శాఖ కాలనీలలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించడంతోపాటు, సంఘ వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపాలని ఆదేశించారు. వైద్యశాఖ అధికారులు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మూడు డివిజన్లను ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు.