ఏపీలో మే 13న పోలింగ్ ముగిసినప్పటి నుంచి పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. రాష్ట్రంలో పోలింగ్ రోజున, ఆ తర్వాత రోజున జరిగిన హింసాత్మక ఘటనలు తీవ్ర ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. కౌంటింగ్ సందర్భంగా ఇంకెలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో, పలుచోట్ల రిటర్నింగ్ అధికారులపై ఒత్తిళ్లు వస్తున్నట్టు తెలుస్తోంది. తాడిపత్రి రిటర్నింగ్ అధికారి రాంభూపాల్ రెడ్డి సెలవుపై వెళ్లిపోవడమే అందుకు నిదర్శనం. ఓవైపు తాడిపత్రి ఘటనలపై సిట్ దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ, ఆయన సెలవుపై వెళ్లడం గమనార్హం.
తనను ఎన్నికల డ్యూటీ నుంచి తప్పించాలని రాంభూపాల్ రెడ్డి ఇదివరకే ఉన్నతాధికారులను కోరినా, కౌంటింగ్ వరకు కొనసాగాలని ఉన్నతాధికారులు కోరారు. అయితే, తనకు ఆరోగ్యం బాగాలేదంటూ ఆయన మరోసారి సెలవు కోసం విజ్ఞప్తి చేయడంతో, అధికారులు అనుమతించక తప్పలేదు.
రాంభూపాల్ రెడ్డి రెండ్రోజులు సెలవు పెట్టినప్పటికీ, కౌంటింగ్ సమయానికి ఆయన విధుల్లో చేరేదీ, లేనిదీ సందేహాస్పదంగా మారింది. పలు జిల్లాల్లో రిటర్నింగ్ అధికారుల పరిస్థితి ఇలాగే ఉందని తెలుస్తోంది.