తెలంగాణలో బీఆర్ఎస్ నేతలందర్నీ కాంగ్రెస్‌కు వదిలేయడం ఎందుకని.. తాము కూడా గేట్లెత్తాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. గ్రేటర్ లో సికింద్రాబాద్ విజయం కిషన్ రెడ్డికి అత్యంత ప్రాధాన్యత కావడంతో ఆయన బీఆర్ఎస్‌లో ఓ పెద్ద వికెట్ ను పడగొట్టేందుకు సిద్ధం అయినట్లుగా తెలుస్తోంది. మాజీ మంత్రి తలసానితో కిషన్ రెడ్డి చర్చలు జరిపారని .. హైకమాండ్ పెద్దలతోనూ మాట్లాడించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాల్సి ఉంది. సికింద్రాబాద్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ కు లక్ష ఓట్లకుపైగా మెజార్టీ రావడంతో తన కుమారుడ్ని నిలబెట్టి ఎంపీగా గెలిపించాలనుకున్నారు. దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేసుకున్నారు. కేసీఆర్ పుట్టిన రోజున ఘనంగా నిర్వహించారు. కానీ తర్వాత క్రమంగా పరిస్థితి అర్థం కావడంతో ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నారు. హైకమాండ్ తలసానినే పోటీ చేయమని ఒత్తిడి చేసినా ఆయన అంగీకరించలేదు. చివరికి పద్మారావును అభ్యర్థిగా ఖరారు చేయాల్సి వచ్చింది. కిషన్ రెడ్డి సొంత అసెంబ్లీ నియోజకవర్గం అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కూడా కిషన్ రెడ్డితో టచ్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇప్పటికే హస్తం గూటికి చేరి, సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేస్తుండగా, అదే దారిలో మరికొందరు ఎమ్మెల్యేలు గోడ దూకేందుకు రెడీ అయినట్టు చెబుతున్నారు. మొత్తంగా బీజేపీ కూడా కొంత మంది బీఆర్ఎస్ నేతల్ని టార్గెట్ చేసుకోవడంతో… ఆ పార్టీ మరింత కుంచించుకుపోనుంది.