దేశంలోని అత్యంత గౌరవనీయ పారిశ్రామికవేత్త రతన్ టాటా, తన జీవితంలో పెళ్లి చేసుకోని కారణాన్ని స్వయంగా వెల్లడించారు. రతన్ టాటాకి ఆయన తాత పేరు రతన్‌జీ టాటా పేరును పెట్టారు. రతన్ టాటా తండ్రి నావల్ టాటాను ఓ అనాథాశ్రమం నుంచి రతన్‌జీ, ఆయన తొలి భార్య సూనూ దత్తత తీసుకున్నారు. ఈ దంపతులు విడాకులు తీసుకోవడానికి ముందు జిమ్మీ జన్మించాడు.
నానమ్మ సాహచర్యంలో..
ఆ తర్వాత స్విట్జర్లాండ్ జాతీయురాలైన సిమోన్‌ను నావల్ టాటా వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ కలిగిన కుమారుడు నోయెల్ టాటా ‘ట్రెంట్’ సహా పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు విడాకులు తీసుకునేటప్పుడు రతన్ టాటా వయసు 10 ఏళ్లు మాత్రమే. ఆ కష్ట సమయంలో నానమ్మ తనకు అండగా నిలిచారని, తనకు మార్గనిర్దేశకత్వం చేశారని రతన్ టాటా పలుమార్లు గుర్తుచేసుకున్నారు. ఆమె తనను దృఢంగా మార్చారని పేర్కొన్నారు.
అమెరికాలో లవ్
అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తర్వాత రతన్ టాటా అక్కడే రెండేళ్లపాటు పనిచేశారు. అమెరికాలో ఆ రోజులు ఎంతో మధురంగా ఉండేవని రతన్ టాటా ఒకసారి గుర్తుచేసుకున్నారు. తనకు సొంతంగా కారు ఉండేదని, ఉద్యోగాన్ని ఎంతగానో ప్రేమించేవాడినని పేర్కొన్నారు. ఆ సమయంలోనే ఆయన ప్రేమలో కూడా పడ్డారు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. అయితే, నానమ్మ ఆరోగ్యం క్షీణించడంతో రతన్ టాటా ఇండియా వచ్చారు. నానమ్మను చూసేందుకు వచ్చిన ఆయన ఏడేళ్లపాటు ఇండియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది.
బంధానికి బ్రేకులు వేసిన యుద్ధం
ప్రియురాలు తన కోసం భారత్ వస్తుందని రతన్ టాటా భావించారు. అయితే, అదే సమయంలో అంటే 1962లో భారత్-చైనా మధ్య యుద్ధం జరుగుతోంది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆమెను ఇండియా పంపేందుకు అంగీకరించలేదు. దీంతో వారి బంధానికి బ్రేకులు పడింది. ఆ తర్వాత రతన్ టాటాపై టాటా గ్రూపును నడిపించాల్సిన బాధ్యత పడింది. ఈ క్రమంలోనే ఆయన టాటా గ్రూపును అత్యున్నత శిఖరాలకు చేర్చారు. ఈ క్రమంలో ఆయన తీరిక లేకుండా గడపడంతో వివాహం చేసుకోలేకపోయానని రతన్ టాటా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.
రతన్ టాటా జీవితానికి సంబంధించిన కొన్ని విశేషాలు
1. టాటా గ్రూప్‌ను స్థాపించిన జమ్‌షెడ్‌జీ టాటా మునిమనవడే రతన్ నావల్ టాటా. డిసెంబర్ 28, 1937న ఆయన జన్మించారు. ముంబయిలో నావల్ టాటా, సోనీ టాటా దంపతులకు జన్మించారు.
2. 1948లో రతన్ టాటా తల్లిదండ్రులు నావల్ టాటా, సోనీ టాటా విడిపోయారు. దీంతో తన అమ్మమ్మ నవాజ్‌బాయి టాటా వద్ద రతన్ టాటా పెరిగారు.
3. రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు. నాలుగు సందర్భాల్లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెళ్లికి దగ్గరగా వెళ్లారు కానీ చేసుకోలేదు.
4. లాస్ ఏంజెల్స్‌లో పనిచేస్తున్నప్పుడు ప్రేమలో పడ్డానని రతన్ టాటా ఒక సందర్భంలో అంగీకరించారు. కానీ 1962 ఇండో-చైనా యుద్ధం కారణంగా అమ్మాయి తల్లిదండ్రులు ఆమెను భారత్ పంపించడానికి నిరాకరించారట.
5. 1961లో రతన్ టాటా కెరియర్ ప్రారంభించారు. టాటా స్టీల్ షాప్ ఫ్లోర్‌లో కార్యకలాపాలను మొదలుపెట్టారు. ఈ అనుభవం ఆయనను భవిష్యత్ నాయకుడిగా తీర్చిదిద్దింది.
6. తన ముత్తాత స్థాపించిన టాటా గ్రూప్ చైర్మన్‌గా 1991లో బాధ్యతలు స్వీకరించారు. 2012 వరకు గ్రూపును నడిపించారు.
7. భారత ఆర్థిక వ్యవస్థ సరళీకరణ సమయంలో టాటా గ్రూపును ఆయన పునర్వ్యవస్థీకరించడం మొదలుపెట్టారు. టాటా నానో, టాటా ఇండికా సహా ప్రముఖ కార్లను కంపెనీ ఉత్పత్తి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
8. టెట్లీని దక్కించుకునేందుకు టాటా టీని, జాగ్వార్ ల్యాండ్ రోవర్ కోసం టాటా మోటార్స్‌ను, కోరస్ కోసం టాటా స్టీల్‌ను రతన్ టాటా కొనుగోలు చేశారు.
9. ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారును మధ్యతరగతి వారికి అందుబాటులోకి తీసుకొస్తానని 2009లో రతన్ టాటా మాట ఇచ్చారు. ఆ మాటను నెరవేర్చుకున్నారు. టాటా నానో కారును రూ.1 లక్ష ధరకు మార్కెట్‌లో ఆవిష్కరించారు. సరసమైన ధరకు చిహ్నంగా ఈ కారు నిలిచింది.
10. పదవీవిరమణ తర్వాత టాటా సన్స్, టాటా ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా కెమికల్స్‌కు ‘గౌరవ చైర్మన్’ బిరుదును అందించారు.