ఎల్లుండి (జూన్ 24) నుంచి లోక్ సభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నియమితులయ్యారు. ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు టీడీపీ పార్లమెంటరీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే పార్టీ పార్లమెంటరీ నేతను ఎంపిక చేశారు. ఇక, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా బైరెడ్డి శబరి, దగ్గుమళ్ల ప్రసాద్ రావు, కోశాధికారిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను చంద్రబాబు నియమించారు. లోక్ సభలో పార్లమెంటరీ పార్టీ విప్ గా హరీశ్ బాలయోగిని నియమించారు.
ఏపీలో మొత్తం 25 ఎంపీ స్థానాలు ఉండగా, ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ 16 స్థానాలు గెలుచుకుని సత్తా చాటింది. ఎన్డీయేతో పొత్తు నేపథ్యంలో, ఇద్దరు టీడీపీ ఎంపీలు కేంద్ర క్యాబినెట్లో చోటు సంపాదించారు. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖమంత్రిగా నియమితులు కాగా, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖల కేంద్ర సహాయమంత్రిగా నియమితులయ్యారు.
యువతకు పెద్ద పీట వేస్తున్న చంద్రబాబు… ఇప్పుడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత ఎంపిక విషయంలోనూ యువతకు ప్రాధాన్యతనిచ్చినట్టు లావు శ్రీకృష్ణదేవరాయలు నియామకంతో స్పష్టమవుతోంది.
2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున నరసరావుపేట ఎంపీగా గెలిచిన లావు శ్రీకృష్ణదేవరాయలు… 2024 ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. సిట్టింగ్ స్థానం నుంచే పోటీ చేసి వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పై ఘనవిజయం సాధించారు.