ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పార్టీ దారుణ పరాభవం తర్వాత వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ మారుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు అధికార టీడీపీ, జనసేన పార్టీల్లోకి జంప్ చేయడంతో చిత్తూరు కార్పొరేషన్ అధికార కూటమి పరమైంది. తాజాగా వైసీపీకి మరో భారీ షాక్ తగలనుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ తో పాటు తొమ్మిది మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం కౌన్సిలర్లతో కలిసి డాక్టర్ సుధీర్ గురువారం అమరావతికి వెళ్లినట్లు తెలుస్తోంది. అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ మంత్రిని కలిసి టీడీపీలో చేరే విషయంపై సుధీర్ చర్చలు జరిపారని, సదరు మంత్రి వీరిని అమరావతికి తీసుకెళ్లారని అనధికారిక సమచారం. ఇక, పుంగనూరులో మున్సిపల్ చైర్మన్ సహా 11 మంది కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేశారు. త్వరలో వారంతా టీడీపీలో చేరనున్నట్లు సమాచారం.