- క్రమశిక్షణకు మారుపేరు తెలుగుదేశం పార్టీ
- నియోజకవర్గంలో ఎమ్మెల్యే తర్వాతనే ఇతరులకు ప్రాధాన్యత
- టిడిపి రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్.జే.వెంకటేష్
మదనపల్లె : పార్టీలో విభేదాలు అన్న మాట పూర్తిగా అవాస్తవమని,క్రమశిక్షణకు మారుపేరు తెలుగుదేశం పార్టీ అని, నియోజకవర్గంలో ఎమ్మెల్యే తర్వాతనే ఇతరులకు ప్రాధాన్యత ఉంటుందని టిడిపి రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్.జే.వెంకటేష్ స్పష్టం చేశారు. శనివారం నిమ్మనపల్లి సర్కిల్ నందు గల తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అన్న క్యాంటీన్లను ప్రారంభించిందన్నారు. ఇందులో భాగంగా మదనపల్లి పట్టణంలో దినసరి సంత, టమోటో మార్కెట్ యార్డ్ వద్ద ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే తనతోపాటు అందరిని ఆహ్వానించారని, వారి సొంత పనులను నిమిత్తం అందరూ ఆ సమయానికి చేరుకోలేకపోయారన్నారు. అనంతరం జిల్లా టిడిపి అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు మదనపల్లికి విచ్చేసి అన్న క్యాంటీన్లు సందర్శించారన్నారు. పార్టీ నియమం ప్రకారం నాయకులు, కార్యకర్తలు ఆయనను కలవడం జరిగిందన్నారు.అయితే ఈ అంశాన్ని పనిగట్టుకుని కొన్ని చానళ్లు, వార్తాపత్రికలు టిడిపిలో విభేదాలు మొదలయ్యాయని ప్రచారం చేయడం జరిగిందని, ఇది సమంజసం కాదన్నారు. నియోజకవర్గంలో ప్రజల చేత ఎన్నుకున్న ఎమ్మెల్యేకి సర్వాధికారాలు ఉంటాయని, ఆయన నిర్ణయాలకు తొలి ప్రాధాన్యత నివ్వాలన్నారు.టిడిపి నాయకులు, కార్యకర్తలకు ఈ విషయంలో ఎటువంటి అపోహలు వద్దని సూచించారు. అదేవిధంగా టిడిపి మైనార్టీ నాయకులు అన్వర్ బాషా జిల్లా అధ్యక్షుడికి తన సమస్యను విన్నవించుకొని ఆదుకోవాలని కోరడం జరిగిందని, అయితే ఆయన మాటలను కొందరు వక్రీకరించి ఎమ్మెల్యేకి తప్పుడు సమాచారం అందించారన్నారు. ఇటువంటి విధానాలను పార్టీ నాయకులు,కార్యకర్తలు మానుకోవాలని హితవు పలికారు. అనంతరం మైనార్టీ నాయకులు అన్వర్ బాషా మాట్లాడుతూ టిడిపికి వీర విధేయుడునన్నారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా గెలుపు కోసం అలుపెరుగని కృషి చేశామన్నారు. అటువంటి వ్యక్తిని తాను ఎందుకు విమర్శిస్తానని,కొందరు తనపై బురద చల్లడానికి అభాండాలు వేస్తున్నారన్నారు. అటువంటివారు ఎక్కువ కాలం మనుగడ కొనసాగించలేరన్నారు. ఈ కార్యక్రమంలో అరికెల జడ్పీహెచ్ఎస్ ఎస్ఎంసి అధ్యక్షులు భువనేశ్వర్ రెడ్డి,జరిపిటి రామ్ముర్తి,ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.