ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో వెల్లడించారు. వైసీపీ సభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ (సంతనూతలపాడు), ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి (రాజంపేట), రేగం మత్స్యలింగం (అరకు), బి. విరూపాక్షి (ఆలూరు) పంపిన ప్రశ్నకు మంత్రి లోకేశ్ శాసనసభలో సమాధానమిచ్చారు.
ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల హయాంలో ఒక్క డీఎస్సీ కూడా విడుదల చేయలేదని మంత్రి విమర్శించారు. గత 30 ఏళ్లలో టీడీపీ ప్రభుత్వాల హయాంలో 13 డీఎస్సీలను నిర్వహించి, 1,80,272 టీచర్ పోస్టులను భర్తీ చేసిందని గుర్తు చేశారు.
ఇక రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌లో 2014-19 మధ్య చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం 2014,18,19లలో మూడు డీఎస్సీలు నిర్వహించిందన్నారు. తద్వారా 16,701 టీచర్ పోస్టులను భర్తీ చేసిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి గణాంకాలను మంత్రి లోకేశ్ వివరించారు.