జగన్ పై రాయి దాడి అనేది పెద్ద డ్రామా అని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు. ఈ కేసులో కావాలనే బొండా ఉమను సీఎం జగన్ వేధిస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటనపై విజయవాడ పోలీస్ కమిషనర్ చేసిన ప్రకటనపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. పోలీసు అధికారులు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడంపై ఇప్పటికే రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేశామని చెప్పారు. హైకోర్టు చీఫ్ జస్టిస్, ఎన్నికల ప్రధాన అధికారికి కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
కూటమి నేతలపై పోలీసు అధికారులు వేధింపులు ఆపాలని… లేకపోతే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. జగన్ చెప్పిన మాటలు విని అధికారులు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. తెలంగాణలో ఐపీఎస్ అధికారుల పరిస్థితి ఏమైందో గమనించాలని సూచించారు. మరో నెల రోజుల్లో తమ ప్రభుత్వం వస్తుందని… గులకరాయి డ్రామా గూడుపుఠానీ బయటపెడతామని చెప్పారు. ఈ డ్రామాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించిన వారికి తగు రీతిలో సన్మానం చేస్తామని అన్నారు.