ఇంటింటిలో బాధలు … !!
పల్లె పల్లెలో సమస్యలు…!!
టిడిపి సానుభూతి పరులపై కక్ష సాధింపులు..!
ఇదేనా పార్టీలకు అతీతంగా సేవలు..?
25వ రోజు “మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని” కార్యక్రమంలో “పులివర్తి నాని”.
తిరుపతి: ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఇంట్లో, ప్రతి పల్లెలో సమస్యలు తిష్ట వేశాయని తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ పులివర్తి నాని అన్నారు. తిరుపతి రూరల్ మండలం, చెర్లోపల్లి పంచాయితీలో పులివర్తి నాని గారు చేపట్టిన “మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని” 25వ రోజు కార్యక్రమం కొనసాగుతుంది. ఉదయం శ్రీరాముల వారి, అమ్మవారి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా ప్రజలు పులివర్తి నాని గారికి బ్రహ్మరథం పట్టారు. ఆయన సమస్యలు సేకరిస్తూ, భరోసా కల్పిస్తూ కార్యక్రమాన్ని కొనసాగించారు.
టిడిపి సానుభూతి పరులపై కక్ష సాధింపులు..!
తిరుపతి రూరల్ మండలంలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులపై వైసీపీ నాయకులు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పులివర్తి నాని ఆరోపించారు. ఇంటి ఇంటికి తిరుగుతున్న సందర్భంలో చాలా చోట్ల టీడీపీ సానుభూతి పరుల ఫించన్లు తొలగించడం, రేషన్ కార్డులు రద్దు చేయడం, ఉద్యోగస్తులను ఇబ్బందులకు గురిచేయడం, చివరికి వికలాంగులను కూడా బెదిరించడం వంటి అంశాలు తన దృష్టికి వచ్చాయన్నారు. ఈ ఘటనలను ఆయన తీవ్రంగా ఖండించారు.
వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యంచేసి తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని తప్పుబట్టారు. వ్యవస్థలను గౌరవించాలి తప్ప కక్ష సాధింపు ధోరణి తగదన్నారు.
ఇదేనా పార్టీలకు అతీతంగా సేవలు…?
ఎన్నికల ముందు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పులివర్తి నాని ఆరోపించారు. ఇదేనా పార్టీలకు అతీతంగా సేవలందించడం అని సూటిగా ప్రశ్నించారు. ప్రతి గ్రామానికి సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చి ప్రతి ఒక్కరికీ, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి నడిపించేందుకు శాయాశక్తులా కృషి చేస్తానని చెప్పి నాలుగేళ్లుగా టీడీపీ సానుభూతి పరులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. 2024లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని, పార్టీలకు అతీతంగా అందరికీ ఒకే విధంగా సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని పులివర్తి నాని అన్నారు.