ప్రస్తుతం యావత్ దేశం దృష్టి లోక్ సభ ఎన్నికలపై ఉంది. కేంద్రంలో ప్రధాని మోదీ హ్యాట్రిక్ కొడతారా? లేదా.. విపక్షాల కూటమి బీజేపీ జోరుకు బ్రేక్ వేస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో పలు మీడియా సంస్థలు ఓటర్ల నాడి ఎలా ఉంది? అనే దానిపై సర్వేలు నిర్వహిస్తున్నాయి.
ప్రముఖ జాతీయ మీడియా ఇండియా టుడే నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో ఏపీలో టీడీపీ అఖండ విజయాన్ని సాధించబోతోందని తేలింది. ఏపీలోని మొత్తం 25 లోక్ సభ స్థానాలకు గాను టీడీపీ ఏకంగా 17 స్థానాల్లో జయకేతనం ఎగురవేస్తుందని సర్వే చెప్పింది. అధికార వైసీపీ కేవలం 8 స్థానాలకే పరిమితం కానుందని తెలిపింది.
వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 45 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో తేలింది. వైసీపీకి 41.1 శాతం, బీజేపీకి 2.1 శాతం, కాంగ్రెస్ కు 2.7 శాతం ఓట్లు వస్తాయని సర్వే తెలిపింది.
తెలంగాణలోని పదిహేడు లోక్ సభ స్థానాల్లో 35,801 శాంపిల్స్‌ను సేకరించింది. ఈ పోల్ డిసెంబర్ 15, 2023 నుంచి జనవరి 28, 2024 మధ్య నిర్వహించారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ మూడు, బీజేపీ మూడు స్థానాల్లోనూ విజయం సాధిస్తాయని, మజ్లిస్ పార్టీ ఒక సీటు గెలుచుకుంటుందని ఈ సర్వేలో వెల్లడైంది.
కాంగ్రెస్ పార్టీకి ఈసారి 41.2 శాతం ఓట్లు వస్తాయని వెల్లడింది. 2019లో కేవలం 29.8 శాతం ఓట్లే వచ్చాయి. ఆ తర్వాత బీఆర్ఎస్‌కు 29.1 శాతం, బీజేపీకి 21.1 శాతం ఓట్లు వస్తాయని తేలింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తొమ్మిది సీట్లు, బీజేపీ నాలుగు, కాంగ్రెస్ మూడు, మజ్లిస్ ఒక సీటును గెలుచుకున్నాయి.