టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా 12వ రోజు ఆందోళనలు కొనసాగించాయి. అనంతపురం జిల్లా రాయదుర్గంలో మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. తెలుగు మహిళల ఆధ్వర్యంలో బీచ్ రోడ్‌లో చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేశారు. విశాఖ సౌత్ ఇంచార్జి గండి బాబ్జిని బీచ్ వద్దకు వెళ్ళనీయకుండా తన కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. విశాఖ బీచ్ వద్ద 300 మంది మహిళా పోలీసుల మోహరించి ముగ్గురు ఏసీపీల నేతృత్వంలో విశాఖ బీచ్‌ను దిగ్బంధం చేశారు. మరోవైపు నిరసన తెలుపుతున్న రాష్ట్ర టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు ప్రణవ్ గోపాల్‌ను పోలీసులు ఆర్కే బీచ్‌లో అరెస్ట్ చేశారు. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ మోకాళ్లపై ద్వారక తిరుమల మెట్లు ఎక్కి, శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ మాడుగుల నియోజకవర్గానికి చెందిన కాళ్ళ నరసింగరావు (రాజు) కాశీలోని గంగానదిలో నిరసన తెలిపారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం బొబ్బర్లంకలో జిల్లా తెలుగదేశం ఉపాధ్యక్షులు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు జలదీక్షలో పాల్గొన్నారు. యలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం ఉమ్మలాడ దగ్గర ఉన్న శారదా నదిలో టీడీపీ నాయకులు జలదీక్ష చేపట్టారు. కనిగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం ఆధ్వర్యంలో చెవులు, నోరు, కళ్ళకు నల్ల రిబ్బన్లు కట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు.
కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు వీరాంజనేయస్వామి గుడి నుండి కామాక్షమ్మ దేవాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. పడాల గంగాధర్ రక్తంతో సంతకం చేశారు. విశాఖలో చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. పెదవాల్తేరు జాలరిపేటలో వందల పడవలతో మత్స్యకారులు నిరసన తెలిపి, చంద్రబాబుపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమాలలో పోలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎన్.ఎం.డి ఫరూక్, రెడ్డెప్పగిరి శ్రీనివాసులు రెడ్డి, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, పార్లమెంట్ అధ్యక్షులు కూన రవికుమార్, కె.ఎస్. జవహార్, గన్నీ వీరాంజనేయులు, కొనకళ్ళ నారాయణ, నెట్టెం రాఘురాం, తెనాలి శ్రావణ్ కుమార్, జీవీ ఆంజనేయులు, ఏలూరి సాంబశివరావు, మల్లెల రాజశేఖర్ గౌడ్, కాలవ శ్రీనివాసులు, బి.కె. పార్థసారథి, మల్లెల లింగారెడ్డి, నియోజవర్గాల ఇంచార్జులు, మాజీ మంత్రులు, రాష్ట్ర, మండల నాయకులు, పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.