- ప్రజా సంక్షేమం కోసం పాటు పడేవారిని ఆదరించాలి.
- భావితరాలను కాపాడుకోవాలి: టీడీపీ మహిళా నేత నాని సుధారెడ్డి
తిరుపతి: వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ఆంధ్రప్రదేశ్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందని తెలుగుదేశం పార్టీ మహిళా నేత నాని సుధా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రపురం మండలం, నడవలూరు పంచాయతీలో ఇదేం ఖర్మ బాబు మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు , చంద్రగిరి నియోజకవర్గ అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధా రెడ్డి పాల్గొన్నారు. ఆయా ప్రాంతాలలో స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు టిడిపి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. మరీ ముఖ్యంగా మాదకద్రవ్యాల వినియోగం రాష్ట్రంలో అధికమైందనీ..,ఇక చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో గంజాయి వినియోగం పెచ్చు మీరందనీ వ్యాఖ్యానించారు. దీంతో యువత మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితాలను విచ్చినం చేసుకుంటున్నారనీ ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులొచ్చాయన్నారు.
మాదకద్రవ్యాల వినియోగాన్ని నియంత్రించాల్సిన పాలకులు పట్టీపట్టనట్లు వ్యవహరించడంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాల్సిన యువత.., మత్తులో జోగుతూ..తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపోతే అభివృద్ధి, సంక్షేమం అటక్కెయ్యాయని ఎద్దేవా చేశారు. ఇకనైనా ప్రజలు మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తమకు మంచిని చేసే వారిని ఆదరించాలని, భావితరాలను కాపాడుకోవాలని సుధా రెడ్డి సూచించారు. కాలయాపన చేస్తే తామంతా అమూల్యం చెల్లించుకోవలసి వస్తుంది ఆమె హెచ్చరించారు