జగన్‌రెడ్డి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు పేర్కొన్నారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ, రాజన్న రాజ్యం వస్తే రైతులను రాజును చేస్తామన్న సీఎం జగన్, రైతులకు దగా చేశారని విమర్శించారు. వ్యవసాయ పెట్టుబడులు పెరిగిపోయి, పంటకు సరైన ధర లేక రైతులు తీవ్ర నష్టాలతో అల్లాడుతున్నారన్నారు. పలువురు రైతులు వ్యవసాయాన్ని వీడి పట్టణ ప్రాంతాలకు కూలీలుగా వలస వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పల్నాడు ప్రాంతంలో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నా, కనీసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చీమకుట్టినట్టైనా లేదు. కనీసం స్పందించకుండా ఈ జిల్లాలోనే జల వనరుల శాఖ మంత్రిగా ఉండి కనీసం దానిపైన రివ్యూ పెట్టకుండా రైతులతోని మాట్లాడకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండటమనేది ఈరోజు రైతాంగాన్ని పూర్తిగా నట్టేట ముంచటమే జగన్ సర్కార్ పనని విమర్శించారు.
అలవిగాని హామీలు ఇచ్చి ఈరోజు పూర్తిగా చేతులెత్తేసి అటు వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసి, సాగునీటి రంగాన్ని కూడా నిర్లక్ష్యం చేసి రైతుల్ని ఈరోజు అధహ్ పాతాళానికి నెట్టేసే పరిస్థితికి వచ్చింది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు డెడ్ స్టోరేజ్ లో ఉన్న వాటర్ ని కూడా పంటలకు ఇచ్చి పంటలను కాపాడాం. నేడు కనీసం ఆ పరిస్థితి కూడా లేదన్నారు.
స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు గానీ, మంత్రులు గానీ క్షేత్రస్థాయిలో పర్యటించకుండా ఈరోజు పంటలన్నీ ఎండబెట్టే పరిస్థితికి వచ్చారు. ప్రత్యామ్నాయ పంటలు ఏమి వేసుకోవాలి, పంటలు రైతులకు సబ్సిడీలో రుణాలు ఇచ్చి గానీ, లేకపోతే ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికి సరయిన మార్గాలు చూపడం గాని జరగడం లేదని మండిపడ్డారు.