- రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన మయూరి లక్ష్మి
- రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యా యురాలిగా మయూరి లక్ష్మి
- క్రమశిక్షణతో కూడిన విద్య బోధన
- విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దటమే నా ధ్యాయం.
అల్లూరి జిల్లా, ది రిపోర్టర్ న్యూస్ (మారేడుమిల్లి):కష్టాన్ని ఇష్టాంగా మలచుకొని ఆటు పోటులను తట్టుకుంటూ ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి పలువురికి స్ఫూర్తి గా నిలుస్తున్నారు మారేడుమిల్లికి చెందిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) ప్రత్యేకాధికారి మయూరి లక్ష్మి.
మారేడుమిల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) ప్రత్యేకాధికారి మయూరి లక్ష్మి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు.ఈమెది స్వస్థలం చింతూరు మండలం చట్టి గ్రామం.ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన తర్వాత తొలుత చింతూరులోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో పని చేశారు.ఆ సమయంలోనే విద్యార్థులకు మంచి క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తూ రాష్ట్ర స్థాయిలో వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు ప్రధమ స్థానాన్ని సాధించుటలో తమ పాత్రను పోషించారు.
అనంతరం 2019 నుంచి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేకాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి విద్యార్థులకు క్రమశిక్షణతో పాటుగా నైపుణ్య లక్షణాలు సామాజిక బాధ్యత పలు విలువలతో కూడిన అంశాలను జోడిస్తూ అవగాహన కల్పిస్తూ విద్యను అందించేవారు.ఇదే క్రమంలో లోతట్టు గ్రామాలను సైతం సందర్శిస్తూ బడికి మానేసిన పిల్లలను నచ్చజెప్పి తల్లిదండ్రులను కలిసి మాట్లాడి బాలికలను తిరిగి చదువుకొనేటట్లు కృషి చేసారు.
ఇదే పాఠశాలలో చదివిన గిరిజన విద్యార్థిని ఇంటర్లో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి జగనన్న ఆణిముత్యాలు పధకంలో ప్రధమ స్థానాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో అనునిత్యం విద్యార్థులపై శ్రద్ద చూపుతూ పాఠశాలను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో అందివేసిన చేయిలాగా తమ ఉపాధ్యాయ కర్తవ్యాన్ని చేపడుతూ వస్తున్నారు.