కరీంనగర్ జిల్లా: నూతన పెన్షన్ అమలుతో సెప్టెంబర్ 1వ తేదీ పెన్షన్ విద్రోహ దినంగా నిలిచిపోయిందని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ వర్తింపచేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాల స్థాయిలో నల్ల బ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాక్టో నాయకులు మాట్లాడుతూ పెన్షన్ పొందడం ప్రభుత్వ ఉద్యోగికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ప్రజాప్రతినిధులకు పెన్షన్ ఉండి 30 సంవత్సరాలు ప్రభుత్వ పథకాల అమలులో కీలక పాత్ర పోషించే ఉద్యోగులకు పెన్షన్ లేకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు ఉద్యోగుల పెన్షన్ రద్దు చేయడం హేయమైన చర్యని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ ను కొనసాగించడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని వెంటనే పాత పెన్షన్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు .సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జాక్టో చైర్మన్ ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు కట్టా రవీంద్రాచారి,ఎం.ఇ.ఓ కె. శ్రీనివాసరెడ్డి,వివిధ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు ఎ. శ్రీనివాస్ రెడ్డి, రామకృష్ణ,నరెందర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.