హైదరాబాద్ నగరంలోని తెలంగాణ శాసన సభ ప్రాంగణంలో శుక్రవారం కలకలం చోటుచేసుకుంది. అసెంబ్లీ ప్రాంగణంలోని శాసన మండలి భవనానికి ఆనుకుని ఉన్న జూబ్లీ హాల్ పరిసరాల్లో 3 తుపాకులు లభ్యమయ్యాయి. జూబ్లీ హాల్ పరిసరాల్లోని చెత్తను తొలగిస్తుండగా… చెట్ల పొదల్లో ఓ తపంచాతో పాటుగా 2 కంట్రీమేడ్ రివాల్వర్లు బయటపడ్డాయి. దీంతో ఆందోళనకు గురైన సిబ్బంది వెనువెంటనే సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన అక్కడకు చేరుకుని తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ప్రభుత్వానికి సంబంధించి ఏ ముఖ్య కార్యక్రమం అయినా జూబ్లీ హాల్ వేదికగానే జరిగేది. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఉన్నత స్థాయి అధికారులు ఈ కార్యక్రమాలకు హాజరయ్యే వారు. ఇలాంటి ప్రదేశంలో తుపాకులు… అది కూడా చెట్ల పొదల్లో లభించడం గమనార్హం.