హైదరాబాద్ : తెలంగాణ సినీ, టివి డబ్బింగ్ కళాకారుల వేతనాలు తెలంగాణ ఆవిర్భవించిన తరువాత మొట్టమొదటి సారిగా తెలంగాణ రాష్ట్ర మూవీ & టివి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ప్రవేశపెట్టింది. యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కిరణ్ కుమార్ మరియు యూనియన్ సభ్యులు వేతనాలకు సంబంధించిన లేఖను తెలంగాణ సినీ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి మూర్తి కి, ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ వారికి ఇచ్చారు. అనంతరం విలేఖరుల సమావేశం లో యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి వి.కవితా ఝాన్సీ, కార్యదర్శి కిరణ్ కుమార్ మాట్లాడుతూ యూనియన్ నిర్ణయించిన వేతనాలు నిర్మాతలను, స్టూడియో యజమానులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయించడం జరిగిందని తెలిపారు. నిర్ణయించిన వేతనాలకు మించి గాని తక్కువగాని ఇవ్వరాదని తెలిపారు. డబ్బింగ్ కళాకారుల యొక్క పారితోషకాలను నేరుగా వారికే చెల్లించవలెనని, యూనియన్ కి కానీ అసోసియేషన్ కు గాని చెల్లించరాదని తెలిపారు. నిర్మాతలను , స్టూడియో యజమానులను మోసం చేస్తున్న దళారి వ్యవస్థను నిర్మూలించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అలాగే సినిమాలకి డబ్బింగ్ ఇంచార్జ్ అవసరం లేకుండా డబ్బింగ్ కళాకారులను నేరుగా నిర్మాతలు, డైరెక్టర్స్ సంప్రదించే వెసులుబాటు కల్పించామన్నారు. ఎందుకనగా నిస్పక్షపాతంగా డబ్బింగ్ కళాకారులను ఎన్నుకునే అవకాశం దీనివలన కలుగుతుందని యూనియన్ సభ్యులు అన్నారు. ఈ కార్యక్రంలో రాష్ట్ర అధ్యక్షురాలు కవితా ఝాన్సీ, కార్యదర్శి కిరణ్ కుమార్, యూనియన్ సభ్యులు డేవిడ్, రాజేష్ లాల్, కిరణ్ పాల్గొన్నారు.
ఫోటోలో ఉన్న వ్యక్తులు : ఎడమవైపు నుండి – సభ్యుడు ఎం. కిరణ్, 2. రాష్ట్ర కార్యదర్శి కిరణ్ కుమార్, ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి మూర్తి, డబ్బింగ్ యూనియన్ సభ్యులు రాజేష్ లాల్, డేవిడ్ పాల్గొన్నారు