ఇంటర్ పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని, షెడ్యూల్ ఖరారు చేసే అంశం తుది దశలో ఉందని అధికార వర్గాలు తెలిపాయి. షెడ్యూల్ దాదాపుగా ఖరారైందని వివరించాయి. వచ్చే వారంలో అధికారికంగా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అనధికారిక సమాచారం ప్రకారం.. మార్చిలో పరీక్షలు నిర్వహించాలని, ఆ నెలాఖరులోగా అన్ని పరీక్షలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
దీనికి అనుగుణంగా మార్చి 3వ తేదీ నుంచే ఇంటర్ పరీక్షలు ప్రారంభిచనున్నట్లు సమాచారం. ఇంటర్ అన్ని గ్రూపులకు చెందిన పరీక్షలు నిర్వహించేందుకు దాదాపు 15 నుంచి 20 రోజుల సమయం పడుతుంది. నెలాఖరులోగా పరీక్షలు పూర్తిచేయాలంటే మార్చి 3న పరీక్షలు ప్రారంభించాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. ఇక, ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ ఫిబ్రవరిలో పూర్తిచేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇంటర్ పరీక్షల ఫీజు గడువు డిసెంబర్ 3 తో ముగియగా ఆలస్య రుసుముతో జనవరి 2 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఇంటర్ బోర్డ్ కల్పించింది. రూ.2 వేల ఆలస్య రుసుముతో ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 9 నుంచి 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరవుతారని ఇంటర్ బోర్డ్ అధికారులు తెలిపారు. దీనికి తగ్గట్లు రాష్ట్రంలో పరీక్షలకు ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు.