తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా సమయాన్ని మార్చినట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. గతంలో నిర్దేశించిన సమయం కంటే అరగంట ముందుగానే నిర్వహించనుంది.
తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కానీ తాజా మార్పు ప్రకారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
రేపటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ హాల్ టికెట్స్ అందుబాటులో ఉంటాయని టీజీపీఎస్సీ ప్రకటించింది. హాల్ టికెట్స్‌తో పాటు శాంపిల్ ఆన్సర్ బుక్ లెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపింది.
563 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా… మెయిన్స్ పరీక్ష కోసం టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. గ్రూప్ 1 పరీక్షలకు నాలుగు లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ప్రిలిమ్స్‌కు 3.02 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. గత నెలలో ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో 31 వేల మందికి పైగా అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు.