డెత్ సర్టిఫికెట్ పెట్టి రిజిస్టర్ చేశారు….కానీ చనిపోయిన’ మహిళ నేరుగా వచ్చి నిలదీసింది.. దెబ్బకు కంగుతిన్న ఆఫీసర్..అసలు స్టోరీ ఏంటి అంటే?
చిత్తూరు జిల్లా కుప్పం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫేక్ డెత్ సర్టిఫికేట్‌తో జరిగిన రిజిస్ట్రేషన్ వెలుగులోకి వచ్చింది. తాను బతికే ఉన్నానంటూ ఆస్తికి అసలైన యజమాని వచ్చి సబ్ రిజిస్త్రార్‌కు ఫిర్యాదు చేయగా.. ఈ వ్యవహారం బయటపడింది. నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ఆస్తిని కాజేసిన వ్యక్తిని, అతనికి సహకరించిన అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
తమిళనాడు రాష్ట్రంలోని ఆంబూరుకు చెందిన కాంచన అనే మహిళకు కుప్పం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో రెండు ఇళ్ల స్థలాలు ఉన్నాయి. అయితే, వాటిపై కన్నేసిన కొందరు మోసగాళ్లు.. ఆమె చనిపోయినట్లు చిత్రీకరించారు. నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించారు. గౌస్ బాషా ఈ వ్యవహారంలో కీలక వ్యక్తిగా అధికారులు గుర్తించారు. గుడుపల్లి మండలం నలగాంపల్లి గ్రామానికి చెందిన కాంచన రవివర్మ చనిపోయిందని, ఆమె భర్తగా మరో వ్యక్తిని చూపించి ఫ్యామిలీ మెంబెర్స్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికెట్‌ను క్రియేట్ చేశాడు గౌస్ బాషా. ఆంబూరుకే చెందిన గౌస్ బాషా.. మున్సిపాలిటీ ఆఫీసులో తనకున్న పరిచయాలతో ఫేక్ సర్టిఫికెట్స్ క్రియేట్ చేసి, సబ్ రిజిస్త్రార్ కార్యాలయ సిబ్బందిని బురిడీ కొట్టించాడు. కాంచన రవివర్మ చనిపోయిందని, ఆమె భర్తగా రవి పెరుమాళ్ అనే కొత్త క్యారెక్టర్‌ను క్రియేట్ చేసిన గౌస్ బాషా.. ఆమెకు సంబంధించిన రెండు విలువైన స్థలాలను కాజేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే గుడుపల్లి మండలం నల్లగాంపల్లిలోని 100 గజాలు, 218 గజాల స్థలాలను తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు.
గత ఏడాది అక్టోబర్ 21న రిజిస్ట్రేషన్ తతంగాన్ని గుట్టుచప్పుడు కాకుండా పూర్తి అయ్యేలా కథ నడిపించాడు. కుప్పం సబ్ రిజిస్త్రార్ కార్యాలయంలో జరిగిన రిజిస్ట్రేషన్ ప్రక్రియకు కొంతమంది రాజకీయ పెద్దలు, అధికారుల సహకారం కూడా పుష్కలంగా అందడంతో సాఫీగానే ఈ వ్యవహారం నడిచింది. అయితే తన పేరిట ఉన్న స్థలాలను గురించి ఆరా తీసే ప్రయత్నం చేసిన కాంచనకు అసలు విషయం తెలిసిపోయింది. దాంతో ఆమె నేరుగా సబ్ రిజిస్టార్ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేసింది.
కాంచన తాను బతికే ఉన్నానని, ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో విలువైన తన ఆస్తిని ఎలా రిజిస్ట్రేషన్ చేశారని సబ్ రిజిస్త్రార్ వెంకటసుబ్బయ్యను నిలదీశారు. దీంతో ఖంగుతిన్న రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది.. జరిగిన మోసంపై ఆరా తీసింది. కాంచన బతికే ఉండగా ఆమెకు చెందిన రెండు విలువైన స్థలాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న గౌస్ బాషాతో పాటు, రిజిస్ట్రేషన్‌కు సహకరించిన స్టాంప్ రైటర్లు, సాక్షులు, సిబ్బందిపై కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు సబ్ రిజిస్ట్రార్ వెంకట సుబ్బయ్య. రికార్డులను పరిశీలించిన పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.