తిరుపతిలో గురువారం స్థానిక కచ్ఛపీ ఆడిటోరియం నందు జిల్లా విద్యా శాఖ మరియు సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి గురు పూజోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులు జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ , చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని , తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు , ఎంపీ మద్దిల గురుమూర్తి , ఎంఎల్సి సిపాయి సుబ్రమణ్యం , నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పలువురు ప్రజా ప్రతినిధులు, విద్యా శాఖ అధికారులు, ఉపాధ్యాయుల తదితరులు పాల్గొన్నారు. ఆహుతులు జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం కార్యక్రమం ప్రారంభమైనది. ముఖ్య అతిధులు ఒక్కొక్కరుగా సభను ఉద్దేశించి ప్రసంగించారు.
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా నేడు గురు పూజోత్సవం జరుపుకోవడం జరుగుతున్నదని తెలిపారు. గురు పూజోత్సవం నందు పాల్గొన్న గురువులకు వందనాలు తెలియ చేశారు. ఏ విద్య నేర్చుకోవాలన్నా గురువు కచ్చితంగా ఉండాల్సిందే… తల్లిదండ్రులు జన్మనిస్తే… గురువులు తన విద్యా బోధనలు విద్యార్థులకు అందించి పునర్జన్మను ప్రసాదిస్తారని తెలిపారు. మన మందరం ఎంతటి స్థానంలో ఉన్న మనం ఓ గురువుకు శిష్యులమే… అని గుర్తు చేశారు. భారత రత్న అవార్డు గ్రహీత మన సర్వేపల్లి రాధా కృష్ణన్ ఒకప్పటి మన భారత ఉప రాష్ట్రపతి మరియు రెండవ భారత రాష్ట్రపతి అని, వారు మహనీయులు అని, స్ఫూర్తి దాయకులు అని కొనియాడారు. వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అందుకే సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా నేడు గురు పూజోత్సవం జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. మా పెద్దాయన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్ విషయంలో రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలకు ఆన్లైన్ కౌన్సెలింగ్ తీసుకు వచ్చారని గుర్తుచేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఉపాధ్యాయులంటే ఎనలేని గౌరవమని గురువులంటే ఆయన ఎంత గౌరవిస్తారో అందరికీ తెలిసిన విషయమే అని సభాముఖంగా గుర్తు చేశారు. అంతేకాకుండా నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా స్కూలుకి, కాలేజీకి ఎటువంటి అవసరం వచ్చిన సమాచారం ఇచ్చిన వెంటనే స్పందించి తక్షణమే పరిష్కరిస్తున్నారని అన్నారు. విద్యార్థులన్నా, విద్యార్థులకు చదువు చెప్పే గురువులన్నా అంత గౌరవమని తెలిపారు. తనకు విద్య బోధనలు అందించిన గురువులను గుర్తు చేసుకున్నారు. నేను ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నానంటే ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషించారని తెలిపారు. గురువులందరికి నమస్కరిస్తూ మీకు ఏ అవసరం వచ్చినా నేను మీకు ముందుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారులు, మండల విద్యాధికారులు, పలు పాఠశాలల ఉపాధ్యాయులు, పలువురు అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.