ప్రతి ఏటా రకరకాల ఆకృతులతో వినాయకుడిని తయారు చేయించడం.. అందమైన సెట్టింగులతో వినాయకుని మండపాన్ని అలంకరణ చేయించడం చెవిరెడ్డి ప్రత్యేకత.. గత 12ఏళ్లుగా ప్రతి ఏటా వినాయకచవితికి వినూత్న రీతిలో వినాయక ప్రతిమను భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేయిస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా సరికొత్తగా తమలపాకుల వినాయకుని ప్రతిమను తయారు చేయించారు చెవిరెడ్డి. వినాయక చవితి పర్వదినాన తమలపాకుల వినాయకునికి ప్రత్యేక పూజలు ఆయన నిర్వహించనున్నారు.
తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట గ్రామంలో ప్రత్యేక ఆకర్షణతో తమలపాకుల వినాయకుడు కొలువు దీరాడు. తమలపాకు వినాయకుని చుట్టూ కృత్రిమంగా అందమైన అడవి ఏర్పాటు చేసి ఇరువైపులా నెమళ్లను కూడా అమర్చారు. భక్తులను ఆకట్టుకునేలా తమలపాకు వినాయకుని ప్రతిమను ఎంతో అందంగా తయారు చేశారు సినీరంగం నుంచి వచ్చిన కార్మికులు. 10 అడుగుల ఎత్తు, 7 అడుగుల వెడల్పు, 10వేల తమలపాకులతో వినాయకుని ప్రతిమను తీర్చారు. అలాగే మఱ్ఱిచెట్టు ఊడలు, పచ్చటి తీగలతో అడవి మద్యన తమలపాకు వినాయకుడు కొలువు దీరియున్నట్లుగా సెట్టింగ్ చేశారు. తమలపాకు వినాయకుని ముందు నెమళ్లను ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా భావించే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి సూచనల మేరకు హైదరాబాదు సినీ రంగం నుంచి వచ్చిన ఆర్కిటెక్చర్ మురళి 10 మంది కార్మికులతో ఐదు రోజుల పాటు శ్రమించి తమలపాకు వినాయకున్ని తయారు చేశారు.
పర్యావరణ రహితంగా తయారీ..
పర్యావరణంకు భంగం కలగకుండా ఒక టన్ను పుట్టమట్టి, ఒక టన్ను కాగితపు గుజ్జుతో పాటు పర్యావరణంకు హాని కలగించని సాదారణ రంగులతో చూడముచ్చటగా తమలపాకుల వినాయకున్ని తయారు చేశారు. శనివారం ఉదయం నుంచే వినాయక ప్రతిమను భక్తులు దర్శించేలా ఏర్పాట్లు చేశారు. తమలపాకు వినాయకునితో పాటు అడవి అందాలను చూడముచ్చటగా ఏర్పాటు చేశారు. శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద వున్న కల్యాణ మండపంలో తమలపాకు వినాయకుని ప్రతిమను కొలువుదీర్చారు. సహజ సిద్ధంగా ఏర్పాటైన అడవిని తలపించేలా సెట్టింగ్ లు వేయడంతో తమలపాకు వినాయకుడు ఎంతో అందంగా ఆకర్షిస్తున్నాడు. వినాయక చవితి పర్వదినాన ఉదయం 11.30 గంటలకు తమలపాకు వినాయకునికి ప్రత్యేక పూజాదికాలను చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి చేతులు మీదుగా నిర్వహిస్తారు.
తమలపాకు వినాయకుని విశిష్టత ..
సనాతన భారతీయ చరిత్రలో తమలపాకులకు ఒక విశిష్టత ఉంది. ప్రతి ఇంటా జరిగే శుభ, అశుభ కార్యాలతో పాటు పండుగల వేళ దేవతా మూర్తులకు నిర్వహించే పూజాదికాలు, యజ్ఞ, యాగాలలో తమలపాకులకు ప్రథమస్థానం కల్పిస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం తమలపాకు లేకుండా ఎటువంటి పూజలు నిర్వహించకరు. అంతేకాదు తమలపాకు దివ్యఔషద గుణాలు కలిగియుంటుందని ఆయుర్వేద శాస్త్రం కూడా చెబుతోంది. దేవతలు సైతం ప్రతీకరంగా స్వీకరించే తమలపాకులతో తయారైన వినాయకున్ని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని ప్రతీతి. ఎంతో విశిష్టత కలిగిన తమలపాకు వినాయకుని దర్శనార్థం భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు.