ఏపీలో 2019 నుంచి 24 వరకు విద్యా వ్యవస్థలో సమూలంగా ప్రక్షాళన జరిగిందని తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి తెలిపారు. తిరుపతిలో సీపీఐ కార్యాలయంలో మంగళవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ చేపట్టిన అఖిలపక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ మాట్లాడుతూ చిన్న పిల్లలు మొదలుకుని వైద్య విద్యార్థులు చదువుకునే కళాశాలల వరకూ మెరుగైన వసతుల కల్పనకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం వేలాది కోట్లు ఖర్చు చేసిందన్నారు. నాడు -నేడు ద్వారా పాఠశాలలతో పాటు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలను అభివృద్ధి చేశామన్నారు. ఉద్యోగుల్ని0 నియమించామన్నారు.
కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడంతో, కోవిడ్ సమయంలో ట్రీట్మెంట్ కోసం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. అలాంటి పరిస్థితి మళ్లీ తలెత్తకుండా , ప్రజల అవసరాలను జగన్ గుర్తించి, మెరుగైన వైద్య సదుపాయాల కల్పన కోసం ఖర్చు పెట్టారన్నారు. రాష్ట్రంలోనే ఎక్కువ మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారని, అందుకోసం మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయడానికి జగన్ ముందుకొచ్చారన్నారు. ఇందులో భాగంగా 17 వైద్య కళాశాలలను, వాటికి అనుబంధంగా పారా మెడికల్ కళాశాలలు, నర్సింగ్ కళాశాలలను తీసుకొచ్చారని ఎంపీ గురుమూర్తి తెలిపారు. దీని వల్ల ఎక్కువ మంది వైద్య విద్యను అభ్యసించేలా , అలాగే ప్రజలు ట్రీట్మెంట్ పొందేలా ప్రణాళికల్ని తమ ప్రభుత్వం రూపొందించినట్టు ఆయన చెప్పారు.
కూటమి ప్రభుత్వం వైద్య రంగానికి ఎలాంటి మేలు చేయకపోగా, ఇచ్చిన మెడికల్ సీట్లను తమకొద్దని కేంద్రానికి రాయడం దుర్మార్గమని ఎంపీ తెలిపారు. తమకు ఎక్కువ మెడికల్ సీట్లు కావాలని అన్ని రాష్ట్రాలు కోరుతున్నట్టు ఎంపీ చెప్పుకొచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం మాత్రం ఇందుకు వ్యతిరేకంగా ఎన్ఎంసీకి లేఖ రాసి, విద్యార్థుల భవిష్యత్‌ను కాలరాసేలా వ్యవహరించిందని ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అపసవ్య దిశలో ప్రయాణిస్తోందని, వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయడానికి కంకణం కట్టుకుందని ఆయన విరుచుకుపడ్డారు. ఈ ధోరణి పేద, సామాన్య విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తోందని ఆయన విమర్శించారు.
నీట్‌లో మెరిట్ ర్యాంక్ సాధించడానికి విద్యార్థులు కష్టపడి చదువుతుంటారన్నారు. అయితే ఈ పరిణామాలన్నీ వారి భవిష్యత్‌కు శరాఘాతంగా పరిణమించాయని ఎంపీ విమర్శించారు. పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణాలో 8,700 సీట్లు, తమిళనాడులో 10,600, కర్నాటకలో 11, 650 సీట్లు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 6,150 సీట్లు మాత్రమే ఉన్నట్టు ఎంపీ తెలిపారు.
కొత్తగా రావాల్సిన కళాశాలల ద్వారా అదనంగా 1,750 సీట్లు కోల్పోయామని డాక్టర్ మద్దిల గురుమూర్తి తెలిపారు. నీట్ కటాఫ్ మార్కులు పెరగడం వల్ల చాలా మంది విద్యార్థులు నష్టపోయినట్టు ఎంపీ తెలిపారు. అన్ని విద్యార్థి సంఘాల నాయకులు సదాశయం కోసం సంఘటితమై పోరాటం చేసి లక్ష్యాన్ని సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో తుది వరకూ తాను అండగా వుంటానని ఆయన భరోసా ఇచ్చారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన అఖిలపక్ష సమావేశంలో అన్ని విద్యార్థి సంఘాల రాయలసీమ రీజన్ నాయకులు పాల్గొన్నారు.