తిరుపతి నగరపాలక సంస్థ అధికారుల సమీక్షా సమావేశంలో కమిషనర్ అదితి సింగ్ పక్కన ఎమ్మెల్యే ఆరనణి శ్రీనివాసులు అన్న కొడుకు శివకుమార్ తానే ప్రజా ప్రతినిధి అన్నట్లుగా కూర్చోవడం ఏమాత్రం సరికాదని దీనిపై తిరుపతి ఎమ్మెల్యే వెంటనే ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి రాయపనేని హరికృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
తిరుపతి ఎమ్మెల్యే గా తాను అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి నగర అభివృద్ధికి పారదర్శకంగా పనులు చేయాల్సిన ఆరణి శ్రీనివాసులు తనకు బదులుగా తన అన్న కొడుకుని సమావేశాల్లో కూర్చోబెట్టడం చట్ట వ్యతిరేకమని ఇది అవినీతిని ప్రోత్సహించడానికి సహకరిస్తుందని మండిపడ్డారు. గతంలోనూ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆరణికి ఇంత చిన్న విషయం తెలియదా?? అని ప్రశ్నించారు. అంటే శాసనసభకు కూడా ఇకపై తనకు బదులుగా శివకుమార్ నే పంపించడానికి ఆరణి సిద్ధమయ్యారా?? అని నిలదీశారు. ప్రజాప్రతినిధిగా తనకు ఉన్న బాధ్యతలను విస్మరించి తన కుటుంబ సభ్యులకి పెత్తనం అప్పగిస్తే గత వైసిపి ప్రభుత్వం లో ప్రజాప్రతినిధులు ఎదుర్కొన్న చీత్కారాలను ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎమ్మెల్యే కు బదులుగా అధికారుల సమావేశానికి ఆయన అన్న కుమారుడిని ఐఏఎస్ ఆఫీసర్ అదితి సింగ్ ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. అయ్యా ఎస్ అనే పరిస్థితి ఐఏఎస్ లకు రాకూడదని సీఎం, డిప్యూటీ సీఎం చెబుతుంటే అందుకు విరుద్ధంగా ఎలా వ్యవహరిస్తారని అన్నారు, ఐఏఎస్ గా తన విధులను విస్మరించి అధికారుల సమావేశంలోకి అర్హత లేని వ్యక్తిని ఎమ్మెల్యే గా గౌరవిస్తూ కీలక సమాచారాలను ఆయనకు ఎలా అందజేస్తారని అన్నారు. ఇలాంటివి భవిష్యత్తులో జరగకూడదని ఈ సంఘటనపై కమిషనర్ అదితి సింగ్ పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా కలెక్టర్ ను ఆయన కోరారు.