తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధికి సూచికలుగా గుంతల రహిత రహదారులను ఏర్పాటు చేసేందుకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ లు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. పాకాల మండలం ఇ-పాలగుట్ట పల్లి పంచాయతీ, శేషాపురం నుంచి గుంతల రహిత రహదారుల కార్యక్రమంను భూమిపూజ చేసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే పులివర్తి నాని శనివారం ప్రారంభించారు. శేషాపురంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కు ఎమ్మెల్యే పులివర్తి నాని ఘన స్వాగతం పలికారు. సిక్కోలు -కల్లూరు ఘాట్ రోడ్డు నుండి శేషాపురం వరకు గుంతల రహిత రహదారుల పనులకు భూమి పూజ చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 6 కిలో మీటర్లకు గాను 4.50 లక్షల రూపాయలతో మరమ్మతులను చేపట్టనున్నట్లు తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలో మొదట ఫేస్ లో 11 గుంతల రహిత రహదారి పనులకు 87.63 కీలో మీటర్లుకు 89.40 లక్షల రూపాయలతో మరమ్మత‌్తులు చేపట్టనున్నట్లు వారు వివరించారు. చంద్రగిరి నియోజకవర్గంలో రోడ్ మరమ్మతులకు నిధులు సరిపోకపోవడంతో పనులు పూర్తి చేయటానికి ఆలస్యమవుతున్నదని, తొందరగా పనులు పూర్తి చేసేందుకు నిధులను విడుదల చేయాలని ఎమ్మెల్యే నాని కలెక్టర్ దృష్టికి తీసుకొని వచ్చారు. ముఖ్యంగా పాకాల మండలంలో ఏనుగుల బెడద ఎక్కువగా ఉందని కలెక్టర్ కి తెలిపారు. పలమనేరు అటవి ప్రాంతం నుంచి ఏనుగులు వలస రావడంతో అటవీ ప్రాంతం సమీపంలోని గ్రామాల పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయని, వాటి వలన త్రీవ్ర నష్టం వాటిల్లుతుందని ఎంయల్ఏ చెప్పారు. నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందేలా చూడాలని కలెక్టర్ ను ఎమ్మెల్యే కోరారు. మారుమూల గ్రామమైన శేషాపురంలో సెల్ టవర్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ఏనుగుల బీభత్సంలో నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందేలా చూస్తామని, సెల్ టవర్ సంబంధించిన ప్రతినిధులతో మాట్లాడి సెల్ టవర్లు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే కు కలెక్టర్ హామీ ఇచ్చారు. దామలచెరువు – కొమ్మిరెడ్డిగారిపల్లి వరకు రోడ్డు పనులు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంభందించిన అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేసారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కన్నా చంద్రగిరి నియోజకవర్గానికి నిధులు ఎక్కువగా మంజూరు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అధికారులతో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.