తిరుపతి జిల్లా చంద్రగిరి: జిల్లా వ్యాప్తంగా సాగుదారుల అసైన్డ్ భూములను కారుచౌకగా కొట్టేస్తున్న వ్యవహారంపై అంతటా చర్చ జరుగుతున్న వేళ చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఇరంగారి పల్లి పంచాయతీ చెరువు కబ్జా వెలుగు చూసింది.
భూముల విలువ కోట్లాది రూపాయలు కావడంతో కాదేదీ కబ్జాకు అనర్హం అన్నట్లు ఎక్కడపడితే అక్కడ స్థలాల ఆక్రమణ జరుగుతోంది. ఇరంగారి పల్లి పంచాయతీ పరిధిలో ఉన్న దిగువకుంట చెరువును కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు స్థానిక నాయకులతో కలిసి చెరువులు పూడ్చి ప్లాట్లుగా మార్చడం జరుగుతుంది.
వివరాల్లోకి వెళ్తే పాకాల రైల్వే గేట్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ వ్యక్తి భూమిని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కొనుగోలు చేయడం జరిగింది. అందులో కొంత భాగం ఒరిజినల్ అయినప్పటికీ కొంత భాగం డీకేటి భూమి కలదు, అందులో ఈ స్థలానికి పక్కన ఉన్న ప్రభుత్వ చెరువును ఇదే అదునుగా చేసుకొని చెరువు మట్టిని జెసిబి యంత్రాలతో ట్రాక్టర్ల ద్వారా వెంచర్ కు మట్టిని తొలి చదును చేసి ప్లాట్లుగా వేయడం జరుగుతుంది. ఇంత జరుగుతున్న అటు రెవెన్యూ అధికారులు కానీ ఇటు ఇరిగేషన్ అధికారులు కన్నెత్తి చూడడం లేదని స్థానిక ప్రజలు ప్రజాసంఘాల నాయకులు వాపోతున్నారు.
దిగువ చెరువు కింద గతంలో రెండు కుంటలు ఉండేవని, ఆ కుంట ల ద్వారా దిగువనున్న ఆయకుట్టుకు నీరు అందేదని ఇప్పుడు ఆ కుంట నుండి వచ్చే కాలువలో కూడా పూడ్చివేశారని స్థానికులు తెలియజేస్తున్నారు. అధికారులను వివరణ అడగ్గా మా దృష్టికి రాలేదు ఒకసారి మా సిబ్బందిని పంపించి , క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం అంటున్నారు.