తిరుపతి జిల్లా పాకాల మండలం, పాకాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం నాడు టిడిపి, వైసీపీ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణ సంఘటనలపై జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు సీరియస్ అయ్యారు. ఈ ఘటనలకు సంబంధించి ముందస్తు సమాచారాన్ని ఉన్నతాధికారులకు ఇవ్వడం లో నిర్లక్ష్యం వహించిన స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ (హెచ్.సి 2869) ఎం. సుబ్రహ్మణ్యం రెడ్డిని జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సదరు ఎస్.బి హెడ్ కానిస్టేబుల్ విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు ప్రాధమిక విచారణలో తేలడంతో ఎస్పీ సస్పెండ్ చేశారు. అదేవిధంగా జరిగిన సంఘటనలకు సంబంధించిన సమాచారాన్ని పై అధికారులకు తెలియజేయకుండా విధులలో నిర్లక్ష్యం వహించిన పాకాల ఇన్చార్జి, సి.ఐ ఏ.శ్రీరాముడు, యస్.ఐ లు ఎస్.ఇషాక్ బాష, ఆర్.లోకేష్ కుమార్ లకు మెమో జారీ చేసి ఘటనపై తక్షణమే వివరణ ఇవ్వాలని ఎస్పీ కోరారు. క్రమశిక్షణ కు మారుపేరైన పోలీస్ శాఖ లో సిబ్బంది వారి విధులు సక్రమంగా నిర్వర్తించకుండా, అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని ముక్యంగా నిర్లక్ష్యం, జవాబుదారీతనం లోపిస్తే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఈలాంటి ఘటనలు పునరవృతం కాకూడదని జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు హెచ్చరించారు.