తిరుపతి: ఇనుప గొడ్డళ్లతో కడప జిల్లా ఫారెస్టు పరిధిలో అడవుల్లోకి జొరబడుతున్న 9మందిని శుక్రవారం రాత్రి టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్సు ఎస్పీ కే. చక్రవర్తి ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీధర్ అధ్వర్యంలో ఆర్ఎస్ఐ ఆలీ బాషా, మురళీధర్ రెడ్డి టీమ్ కడప జిల్లా రాజంపేట చేరి, నందలూరు వైపు వెళుతుండగా, సిద్దవటం బాకరాపేట రేంజి మండపల్లి వద్ద కొందరు వ్యక్తులు అడువుల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరిని చుట్టుముట్టి వారి వద్ద ఉన్న ఇనుప గొడ్డళ్లు, ఒక మోటారు సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు. వారిని సిద్దవటం మండలానికి చెందిన మాచుపల్లి మహేష్ (30), నాసరి సుబ్బరాయుడు (46), పుల్లంపేటకు చెందిన కత్తి నాగరాజు (34), కుమ్మితి గంగాదర్ (40), షేక్ హుసేన్ బాషా (30), దూదేకుల చిన్న హుసేన్ (34), దుదేకుల హుసేనయ్య (53), దూదేకుల హుస్సేని (31), అనకల బాల సుంకన్న (35) లను అరెస్టు చేశారు. తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసి, ఎస్ఐ బాలకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు. అదే విధంగా ఆర్ఎస్ఐ నరేష్ సానిపాయ సబ్ కంట్రోల్ నుంచి రాజంపేట రేంజ్ తుమ్మల బైలు సెక్షన్ వత్తలూరు వద్ద కూంబింగ్ చేస్తుండగా, కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలను మోసుకుని వెళుతూ కనిపించారు. వీరిని చుట్టుముట్టే ప్రయత్నం చేయగా దుంగలు పడేసి పారి పోయారు. ఆ ప్రాంతంలో తొమ్మది ఎర్రచందనం దుంగలు లభించాయి. వీరి కోసం ఒక బృందం గాలిస్తున్నారు. దుంగలను తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషనకు తరలించగా, ఎస్ ఐ మోహన్ నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.