- శ్రీవారి ఆలయం సహా ముఖ్య ప్రాంతాల్లో టీటీడీ, పోలీసు ఉన్నతాధికారుల పరిశీలన
తిరుపతి, మే-24 : ఆధునిక టెక్నాలజి సాయంతో తిరుమలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడతామని రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1 వద్ద బుధవారం అయిన మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో రెండు రోజులపాటు భద్రతాపరమైన అంశాలపై సమీక్ష నిర్వహించామని చెప్పారు. సీసీటీవీ కంట్రోల్ రూమ్ లో కృత్రిమ మేధను ఎలా వినియోగించాలి, ఎలాంటి సాఫ్ట్వేర్లను వాడాలి అనే అంశాలపై అధ్యయనం చేస్తామన్నారు. అదేవిధంగా యాంటీ డ్రోన్ టెక్నాలజీ, బాడీ స్కానర్స్ వినియోగంపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని తెలిపారు.
డిఐజి అమ్మిరెడ్డి మాట్లాడుతూ భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపడానికి ఎస్పీ లేదా ఏఏస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఏడు కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీల్లోని అధికారులు 15 రోజుల పాటు పరిశీలన జరిపి నివేదిక సిద్ధం చేస్తారని, మరోసారి సమావేశమై సమీక్షిస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తర్వాత కమిటీలు చేసిన సూచనలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తామన్నారు.
అంతకుముందు తిరుమల శ్రీవారి ఆలయం, కొత్త పరకామణి భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1, కమాండ్ కంట్రోల్ రూమ్ తదితర ప్రాంతాలను పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించి భద్రత అంశాలను తనిఖీ చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లో తిరుమలలో సిసి కెమెరాల ద్వారా నేరస్తులను గుర్తించే విధానాన్ని పరిశీలించారు.
టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, ఓఎస్డీ ఐఎస్ డబ్ల్యు శశిధర్ రెడ్డి, టిటిడి సివిఎస్వో నరసింహ కిషోర్, ఇంటెలిజెన్స్ ఎస్పీ సుమిత్, గ్రేహౌండ్స్ ఎస్పీ బిందుమాధవ్, 14వ బెటాలియన్ కమాండెంట్ జగదీష్, తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, ఆక్టోపస్, ఎస్పీఎఫ్, జిల్లా పోలీసు, అటవీ, అగ్నిమాపక, ఇతర బలగాలకు చెందిన పలువురు అధికారులు, టీటీడీ సీఈ నాగేశ్వరరావు, ఎస్‌ఈ-2 జగదీశ్వర్‌రెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, వీజీవోలు బాలిరెడ్డి, మనోహర్, గిరిధర్‌రావు, జిఎం ఐటీ సందీప్ తోపాటు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
అన్నమయ్య భవనంలో సమావేశం
ఆ తరువాత మధ్యాహ్నం తిరుమల అన్నమయ్య భవనంలో టిటిడి సివిఎస్వో నరసింహ కిషోర్, ఇంటెలిజెన్స్ ఎస్పీ సుమిత్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, ఆక్టోపస్, బాంబుస్క్వాడ్, ఎస్పీఎఫ్, జిల్లా పోలీసు, అటవీ, అగ్నిమాపక, ఇతర బలగాలకు చెందిన పలువురు అధికారులు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.