- 885వ రోజుకు చేరుకున్న టీటీడీ అటవీ కార్మికుల నిరాహార దీక్షలు
తిరుపతి: ఐదేళ్ల కిందట ప్రతిపక్ష నేతగా హామీనిచ్చిన జగన్మోహన్ రెడ్డి,.. ముఖ్యమంత్రి హోదాలో సైతం హామీనిచ్చి అమలు చేయని పరిస్థితిలో ‘జగనన్నా.. నిన్ను నమ్మేదెలా..? అంటూ సి.యం తీరును తప్పుబడుతూ…నిరసన వ్యక్తం చేశారు. బుధవారం తిరుపతి లోని హరే రామ హరే కృష్ణ రోడ్డులోని టీటీడీ అటవీ కార్యాలయం ఎదుట కార్మికులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. రిలే నిరాహార దీక్షలు 885వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి హామీ అమలు చేయకపోవటాన్ని నిరసిస్తూ, 2019లో టీటీడీ బోర్డు చేసిన తీర్మానాన్ని అమలు చేయకపోవటాన్ని నిలదిస్తూ.., రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయని ధోరణిని ప్రశ్నిస్తూ.. టీటీడీ అటవీ కార్మికులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడారు. ఐదేళ్ల కిందట ఇచ్చిన హామీని అమలు చేయని ముఖ్యమంత్రి, టీటీడీ బోర్డు తీర్మానాన్ని సైతం పట్టించుకోని టీటీడీ యాజమాన్యం, పదేపదే విజ్ఞప్తులు చేస్తున్నా పట్టించుకోని మంత్రులు, ఎమ్మెల్యేలు “జగనన్నే మా భవిష్యత్తు”, ‘జగనన్నే మా నమ్మకం’ అంటూ చేస్తున్న ప్రచారానికి అర్థం లేదన్నారు. 2019లో టీటీడీ బోర్డు అటవీ కార్మికుల్ని టైం స్కేల్ ఉద్యోగులుగా గుర్తిస్తూ తీర్మానం చేసిందని, మూడేళ్లు కావస్తున్నా పట్టించుకోకపోవటం అన్యాయమని విమర్శించారు. 2021 వ సంవత్సరంలో వరద తాకిడికి గురైన తిరుపతిని సందర్శించిన సందర్భంగా టిటిడి కార్మికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భరోసానిచ్చారని, తన హామీ 24 గంటల్లో అమలవుతుందని ప్రకటించారని గుర్తు చేశారు. రెండేళ్లుగా 24 గంటలు ఇంకా గడవలేదా? ముఖ్యమంత్రి గారు అంటూ…, కందారపు మురళి ప్రశ్నించారు. పదేపదే రాష్ట్ర ప్రభుత్వానికి, టీటీడీ యాజమాన్యానికి విజ్ఞప్తులు చేస్తున్నా పట్టించుకోకపోవడం ధర్మమా? అని నిలదీశారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి బాధ్యతలు చేపట్టిన నాడే అటవీ కార్మికుల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి, ఇప్పటివరకూ హామీని నిలబెట్టుకోకపోవడం ధర్మమేనా..? అన్నారు. టీటీడీ బోర్డు ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి పలుమార్లు అటవీ కార్మికుల సమస్యను పరిష్కరిస్తామని చెప్పి పరిష్కరించలేదని గుర్తు చేశారు. 362 మంది ఉన్న టీటీడీ అటవీ విభాగంలో 162 మందిని పర్మినెంట్ చేసి, రెండు వందల మందిని పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. దేవదేవుని సన్నిధిలో ధర్మాన్ని కాపాడవలసిన చోట అధర్మంగా ప్రవర్తిస్తూ వివక్షకు పాల్పడుతుంటే ఎవరికీ చెప్పాలనీ డిమాండ్ చేశారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాన్ని సైతం పట్టించుకోకుండా టీటీడీ యాజమాన్యం పక్కన పెడుతున్నదంటే…. కావాలనే పేద కార్మికుల పట్ల వ్యతిరేక భావంతో టీటీడీ యాజమాన్యం వ్యవహరిస్తున్నట్టుగా అర్థమవుతోందన్నారు. అత్యంత పేదలైన అటవీ కార్మికుల పట్ల టిటిడి యాజమాన్యానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకంత కక్ష అర్థం కావడం లేదని అన్నారు. సిఐటియు సంఘంలో ఉండడమే వారు చేసిన నేరమా? అని ఆయన అన్నారు. ధర్మాన్ని విడనాడ వద్దని ధర్మంగా వ్యవహరించమని టిటిడి ఇఓ ధర్మారెడ్డికి సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జి. బాలసుబ్రమణ్యం, టిటిడి అటవీ కార్మికుల సంఘం నేతలు ఈశ్వర్ రెడ్డి, సురేష్, మునికృష్ణ, మల్లికార్జున్, వాసు, కృష్ణమూర్తి, సురేంద్ర, వేణు, గణేష్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.