- రైతులు , ఇళ్ల స్థలాల నిరుపేదలకు న్యాయం చేయాలి… !!
- సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్
తిరుపతి: తిరుపతి జిల్లా తిరుపతి అర్బన్ శెట్టిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని శెట్టిపల్లి రైతులు,పేదలకు ఇళ్ల స్థలాలను ఇచ్చి, వారికి ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ లేనందువల్ల స్పందనలో డిఆర్ఓకు సీపీఐ బృందం పి మురళి , చిన్నం పెంచలయ్య , జె. విశ్వనాథ్ లు వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి మాట్లాడుతూ శెట్టిపల్లి భూ సమస్య పరిష్కారం కోసం గత కొన్నేళ్లుగా ఇటు రైతులు, ఇళ్ల స్థలాల కేటాయించాలనీ అటు నిరుపేదలు.. ఆర్డిఓ కార్యాలయం , కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగినా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోవడం దారుణమన్నారు.
అయితే కలెక్టర్ ఉన్నట్టుండి శెట్టిపల్లి గ్రామపంచాయతీని తిరుపతి కార్పొరేషన్ లో విలీనం చేస్తామని ప్రకటన చేయడం రైతులకు పేదలకు భయాందోళన కలిగిస్తుందన్నారు. పంచాయతీని కార్పొరేషన్లో విలీనం చేయడం సిపిఐ స్వాగతిస్తుందని, కానీ అక్కడ భూ సమస్య ఏమేరకు పరిష్కారం జరిగిందో ప్రకటన చేయకపోవడం బాధాకరం అన్నారు . తుడాకు గతంలో ఇచ్చిన రాష్ట్ర క్యాబినెట్ జీవో రద్దు చేశారా? రద్దు చేసిన తర్వాత నగరపాలక సంస్థకు విలీనం చేశారా? శెట్టిపల్లె భూ బాధితుల సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తున్నారో తిరుపతి జిల్లా రెవిన్యూ యంత్రాంగం స్పష్టంగా తెలపాలని డిమాండ్ చేశారు. గతంలో అధికారులందరూ 60 : 40 పర్సెంట్ ప్రకారం భూ సమస్య పరిష్కరిస్తామని చెప్పి అందుకు బాధితులందరూ అంగీకరించిన ప్రభుత్వం మాత్రం పరిష్కరించకుండా ఎమ్మెల్యేల కుమ్ములాటలతో రైతులకు పేదలకు అన్యాయం జరగబోతున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తిరుపతి జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి భూములు సమస్య పరిష్కారం చేయకపోతే కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పేదల పక్షాన నిలబడి ఆ భూములలో ఇండ్లు నిర్మిస్తామని ఎన్ని కేసులు వచ్చినా భరిస్తావని బాధితులకు భరోసా ఇచ్చారు తక్షణం ప్రభుత్వ స్పందించాలి భూ సమస్య పరిష్కరించాలి లేకుంటే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు .