తిరుపతి : నగరంలోని ప్రతి కూడలి, డివైడర్లలో చెత్త తొలగించి పూల మొక్కలు నాటి సుందరంగా తీర్చిదిద్దాలని నగరపాలక సంస్థ కమిషనర్ హరిత అధికారులను ఆదేశించారు. బుదవారం ఉదయం నగరంలోని 3, 12, 13, 14 వార్డుల్లో గల లక్ష్మీపురం కూడలి, జయనగర్, గుర్రం జాషువా మార్గం, న్యూ ఇందిరానగర్, ఎస్.జీ.ఎస్. కాలేజ్ రోడ్డు, రాఘవేంద్ర నగర్, ఎయిర్ బైపాస్ రోడ్డులో జరుగుతున్న పారిశుద్ధ్య పనులు, రోడ్లను డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, కార్పొరేటర్లు ఎస్.కే.బాబు, ఆంజనేయులు, నగరపాలక సంస్థ అధికారులతో కలసి పరిశీలించారు. లక్ష్మీపురం కూడలి అపరిశుభ్రంగా ఉండడంతో వెంటనే శుభ్రం చేసి పూల మొక్కలు నాటి సుందరంగా తీర్చిదిద్దాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే నగరంలోని అన్ని కూడళ్ళు సుందరీకరణ చేయాలన్నారు. జయనగర్, న్యూ ఇందిరానగర్ ప్రాంతాల్లో ఇంటి వద్దకు వెళ్ళి చెత్త వాహనాలు ఎన్ని గంటలకు వస్తున్నాయి, వీధులు తరచూ శుభ్రం చేస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది ప్రతి ఇంటి వద్ద తడి,పొడి చెత్త వేర్వేరుగా స్వీకరించాలని ఆదేశించారు. ఎస్.జీ.ఎస్. కాలేజ్ రోడ్డులో ఉన్న గుంతలు వెంటనే పూడ్చాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రజా మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలన్నారు. టిఫిన్ షాప్స్, జనరల్ స్టోర్స్ వద్దకు వెళ్ళి ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్నరా అని పరిశీలించారు. ఎవరైనా ప్లాస్టిక్ వినియోగిస్తే జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్పందన, జగనన్నకు చెబుదాం కార్యక్రమాల్లో వచ్చిన పిర్యాదులు మేరకు ఆయా వార్డుల్లో పర్యటించి పరిష్కారిస్తున్నమన్నారు. నగరంలో అన్ని వార్డుల్లో పర్యటించి చెత్త సేకరణ, స్వీపింగ్ సక్రమంగా జరుగుతోందా తెలుసుకుని నగరంలో పారిశుద్ధ్యం బాగా జరిగేలా చూస్తున్నామన్నారు. అలాగే నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని అన్నారు. రానున్న వర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకుని చిన్న, పెద్ద డ్రెయినేజీ కాలువల్లో చెత్త తొలగించేలా చర్యలు చేపట్టామన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, మునిసిపల్ ఇంజినీర్ చంద్రశేఖర్, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ హరికృష్ణ, డి.సి.పీ. శ్రీనివాసులు, ఏసిపి బాలసుబ్రహ్మణ్యం, డి. ఈ. సంజయ్ కుమార్, శానిటరీ సూపర్ వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు ఉన్నారు