తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం నుంచి పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామి వారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, సహస్ర నామార్చన చేశారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారి ఉత్సవర్లను కల్యాణ మండపంలోకి వేంచేపుగా తీసుకుని వచ్చారు. మరోవైపు యాగశాలలో జరిగిన వైదిక కార్యక్రమాల తర్వాత పవిత్ర మాలలు ఊరేగింపుగా ఆలయంలోకి తెచ్చారు. అనంతరం స్వామి , అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం సేవను వైభవంగా పూర్తి చేశారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, చందనంతో విశేషంగా ఉత్సవర్లను అభిషేకించారు. చివరగా యాగశాలలో వైదిక కార్యక్రమాలు పూర్తి చేసి శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి సోదరుడు చెవిరెడ్డి రఘునాథ రెడ్డి, మంజుల దంపతులతో పాటు గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.