- శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్న ఆలయ అధికారులు
- 16వతేదీన పూర్ణాహుతితో ముగియనున్న ఉత్సవాలు
తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఆలయ అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ప్రతి కైంకర్యాన్ని ఇక్కడ నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో పవిత్రోత్సవాల నిర్వహణను శాస్త్రోక్తంగా చేపట్టనున్నారు. 13వతేదీ సాయంత్రం 6గంటలకు యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 14వతేదీ ఉయం 9గంటలకు పవిత్రాల ప్రతిష్టను శాస్త్రోక్తంగా చేపడతారు. 15వతేదీ ఉదయం 9.30 గంటలకు ఆలయంలోని మూలమూర్తితో పాటు పరివార దేవతామూర్తులు, ఉత్సవర్లు, ధ్వజపీఠం, గరుడాళ్వార్ లకు పవిత్ర సమర్పణ చేయనున్నారు. 16వతేదీ సాయంత్రం 5.15 గంటలకు యాగశాలలోని హోమగుండంలో పూర్ణాహుతిని నిర్వహించి ఉత్సవాలను ముగించనున్నారు. నాలుగు రోజుల పాటు సాగే పవిత్రత్సోవాలకు కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది.
పవిత్రోత్సవాలు ఎందుకు చేస్తారు..
ఏడాదికి ఒకసారి నిర్వహించే పవిత్రోత్సవాలు వల్ల ఆలయంలో జరిగే దృష్టి దోషాలు, మైల దోషాలు, వాస్తు దోషాలు, గ్రహ దోషాలు, గోచార దోషాలు, నక్షత్ర దోషాలు, క్రియా దోషాలు, మంత్ర దోషాలు వంటి సమస్త దోషాల నివారణకు పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. స్వామి వారి ఆలయంలో ఏడాది పాటు జరిగే చిన్నపాటి తప్పిదాలను పవిత్రాల సమర్పణతో శుద్ధి చేసినట్లవుతుందని ఆలయ అర్చకులు స్పష్టం చేస్తున్నారు. శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగే పవిత్రోత్సవాలను తిలకించడానికి భక్తులు తరలి రావాలని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు.