ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త వివాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు వారి ఇళ్ల వద్దకే పంపేందుకు ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వలంటీర్లకు ఇప్పుడు ఓ సరికొత్త బాధ్యతలను అప్పగించారు. పట్టణాల్లోని మరుగుదొడ్ల నిర్వహణ, రుసుము వసూలు కోసం వార్డు వలంటీర్లను నియమించారు. దీనిపై సచివాలయ ఉద్యోగుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వార్డు వలంటీర్లకు మరుగుదొడ్ల నిర్వహణ బాధ్యతలు తప్పించాలని డిమాండ్ చేసింది.
వార్డు వలంటీర్లకు మరుగుదొడ్ల వద్ద విధుల అంశం గుంటూరులో కనిపించింది. నగరంలోని మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఐదు మరుగుదొడ్ల వద్ద రుసుము వసూలు కోసం వార్డు వలంటీర్లను నియమిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం తెలిసినంతనే.. తమను ప్రభుత్వ పథకాలను లబ్ధిదారుల ఇళ్ల వద్దకు చేరవేసేందుకు నియమించుకున్నారని, ఆ విధులకు బదులుగా ఇలా మరుగుదొడ్ల నిర్వహణ, రుసుము వసూలు విధులకు తమను వినియోగించడం సరికాదని సచివాలయ ఉద్యోగుల సంఘం హెచ్చరించింది.