- చిట్టొజిపల్లి గ్రామంలోని భూమిలేని పేదలకు భూమిని పంపిణీ చేయాలి
- సిపిఎం పాదయాత్ర సందర్భంగా ఆర్టీవో కు వినతి
మెదక్ జిల్లా / తూప్రాన్ : చిట్టొజిపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 266/1 భూమిని రెవెన్యూ స్వాధీనంలోకి తీసుకొని రైతులకు న్యాయం చేయాలని, భూమిలేని పేదలకు మిగులు భూమి పంచాలని కోరుతూ చిటొజు పల్లి గ్రామం నుంచి తూప్రాన్ ఆర్డీవో కార్యాలయం వరకు సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. అనంతరం తూప్రాన్ ఆర్డీవో కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కార్యదర్శి ఏం మల్లేశం మాట్లాడుతూ… చేగుంట మండలం చిట్టొజిపల్లి గ్రామ శివారులోని సర్వేనెంబర్ 266/1 గల మొత్తం భూమిని రెవెన్యూ భూమిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోని భూమిలేని పేదలకు, రైతులకు పంచాలన్నారు. ఈ సర్వే నెంబర్ గల భూమి మొత్తం 755 ఎకరాలు కలదు. ఈ భూమి 1954 -1955 కసర పహాని ప్రకారం ప్రభుత్వ భూమిగా రికార్డు లోకి ఉంది. ఈ భూమిని కొందరు నాటి దొరలు గోల్కొండ వెంకట కిషన్ రావు తండ్రి రామారావు పేరు రికార్డులోకి వచ్చిందన్నారు. 1960 – 1972 వరకు వెంకట కిషన్ రావు కొంత మంది రైతులకు భూమిని అమ్మి సాధాభైనామ రసీదులు ఇచ్చారన్నారు. అనంతరం సీలింగ్ చట్టం ద్వారా 1974లో మరికొంత మంది రైతులకు 278 ఎకరాలకు పట్టాలు ఇచ్చి భూ పంపిణీ చేశారు. అనంతరం 1993లో భూదాన యజ్ఞ బోర్డు ద్వారా 80 ఎకరాల భూమిని పట్టాలు ఇచ్చి పేదలకు పంపిణీ చేశారన్నారు. అనంతరం 2004లో భూదాన ద్వారా 32 ఎకరాలు పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం 25. 10. 2017 సంవత్సర కాలంలో గోల్కొండ బద్రీనారాయణ తండ్రి వెంకట కిషన్ రావు దేశముక్, కుర్మా కోటగిరి మానయ్య తండ్రి మల్లయ్య చిత్తోజి పల్లి సర్వేనెంబర్ 266/1 లోనే మూడు ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినప్పటికీ, పట్టా పాస్ పుస్తకం ఇప్పటికీ ఇంకా రాలేదు అన్నారు. పేదలు ఎన్నిసార్లు ఈ భూమి పై సర్టిఫికెట్లు పొందిన వారికి గత ప్రభుత్వం పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చింది తప్ప, భూ ప్రక్షాళన చేసి అందరికీ పట్టా పాస్ పుస్తకాలు ఇస్తామని రెవెన్యూ అధికారులు ఆశలు కల్పించి, తీరా కొత్త పాస్ పుస్తకాలు కొంతమందికే ఇచ్చి, మిగతా వారికి ఇవ్వకుండా ఆపారన్నారు. ఈ భూమిపై కన్నేసిన కొంతమంది పెద్దలు ఈ భూమిని ఇబ్రహీంపూర్ గ్రామ శివారులో ఉన్న వెంకటేశ్వర దేవాలయానికి రిజిస్ట్రేషన్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇట్టి భూమిపై హైకోర్టులో కబ్జాదారులు వేసిన కేసుపై నాటి ఉమ్మడి జిల్లా జాయింట్ కలెక్టర్ శరత్ జవాబు ఇచ్చినారు. ఆ కేసు పెండింగ్లో ఉందన్నారు. ఒకవైపు హైకోర్టులో చేసి పెండింగ్లో ఉండగా మరోవైపు దేవాదాయ శాఖ వారు భూమిని వెంకటేశ్వర దేవాలయం రిజిస్ట్రేషన్ చేస్తామని రైతుల అభ్యంతరాలు తెలపాలని నోటీసులు ఇచ్చారు. 26/1 సర్వే నంబరు గల మొత్తం భూమి రెవెన్యూ భూమి గానీ ఉందన్నారు. కావున ఇట్టి భూమి సమస్య పరిష్కారంలో జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలని 22 – 7 – 2024న ప్రజావాణిలో దరఖాస్తు కూడా చేశామన్నారు. కావున సమస్య పరిష్కారానికి జిల్లా కలెక్టర్ ద్వారా ఆర్డిఓ సమస్యను పరిష్కారం అయ్యే విధంగా జోక్యం చేసుకోవాలని సిపిఎం పార్టీ తూప్రాన్ ఆర్డిఓ దృష్టికి తీసుకెళ్ళారు. కావున ఇప్పటికైనా అధికారులు స్పందించి సర్వేనెంబర్ 266/1 లో గల మొత్తం భూమిని రెవెన్యూ భూమిగా స్వాధీనం చేసుకొని భూమిలేని పేదలకు పంపిణీ చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కే మల్లేశం, నాయకులు ఏ మహేందర్ రెడ్డి, కురుమ మల్లేశం, ప్రవీణ్, చిట్టొజిపల్లి గ్రామ రైతులు పాల్గొన్నారు.