మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ జయభేరి మోగించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో 14 రౌండ్ల అనంతరం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజేతగా నిలిచారు. తాజా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెండో స్థానానికి పరిమితం అయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామమాత్రంగా నిలిచారు.
14 రౌండ్ల అనంతరం కూసుకుంట ప్రభాకర్ రెడ్డికి 95,304 ఓట్లు రాగా, రాజగోపాల్ రెడ్డికి 85,157 ఓట్లు లభించాయి. మూడో స్థానంలో ఉన్న పాల్వాయి స్రవంతి 21,243 ఓట్లతో సరిపెట్టుకున్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత కేవలం 2, 3వ రౌండ్ లోనే బీజేపీకి మొగ్గు కనిపించింది. అది మినహా ప్రతి రౌండ్ లోనూ టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యంతో ముందంజ వేసింది.
14వ రౌండ్ లో కూసుకుంట్లకు 6,608 ఓట్లు, రాజగోపాల్ రెడ్డికి 5,553 ఓట్లు లభించాయి. ఈ రౌండ్ లో టీఆర్ఎస్ 1,055 ఓట్ల ఆధిక్యం సంపాదించింది. మొత్తం 14 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యేసరికి కూసుకుంట్ల ఆధిక్యం 10,094 ఓట్లకు పెరిగింది.