అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తన, మన అనే బేధాలు లేకుండా దేశాలపై సుంకాలు విధించడం, పలు కఠిన నిర్ణయాలతో దూసుకెళుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. పాకిస్థాన్, భూటాన్ సహా 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించే అంశాన్ని ట్రంప్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ 41 దేశాలకు చెందిన పౌరులు యూఎస్ లో అడుగు పెట్టకుండా ప్రయాణ ఆంక్షలు జారీ చేయనున్నారని సమాచారం.
ప్రయాణ ఆంక్షలు విధించాలనుకుంటున్న 41 దేశాలను మూడు గ్రూపులుగా విభజించినట్లు తెలుస్తోంది. మొదటి గ్రూపులో 10 దేశాలు ఉండగా… ఈ దేశాల పౌరులకు వీసాల జారీని పూర్తిగా నిలిపివేయనున్నారట. ఈ గ్రూపులో ఆఫ్ఘనిస్థాన్, ఉత్తరకొరియా, క్యూబా, ఇరాన్, సిరియా తదితర దేశాలు ఉన్నాయి.
ఇక రెండో గ్రూపులో ఇరిట్రియా, హైతీ, లావోస్, మయన్మార్, దక్షిణ సూడాన్ దేశాలు ఉన్నాయి. వీటిపై పాక్షిక ఆంక్షలను అమలు చేయనున్నారని సమాచారం. ఈ దేశాల వారికి పర్యాటక, విద్యార్థి వీసాలతో పాటు ఇతర వలస వీసాలను జారీ చేయకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే, వీటికి కొన్ని మినహాయింపులు ఉండే అవకాశాలున్నాయి.
అలాగే మూడో గ్రూపులో పాకిస్థాన్, భూటాన్, మయన్మార్‌తో సహా మొత్తం 26 దేశాలు ఉన్నట్లు సమాచారం. ఈ దేశాలు 60 రోజుల్లోపు తమ లోపాలను పరిష్కరించడానికి ప్రయత్నాలు చేయకపోతే ఆయా దేశాల పౌరులకు యూఎస్ వీసా జారీని పాక్షికంగా నిలిపివేయడాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఈ జాబితాలో మార్పులు ఉండవచ్చని, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఇంకా దీనిని ఆమోదించాల్సి ఉందని సమాచారం.