contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

  • జాతీయ జెండా ఆవిష్కరించిన సరస్వతి సేవా ట్రస్ట్ ఉపాధ్యక్షులు జానకిరామ్

 

మెదక్ జిల్లా తూప్రాన్ : తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు తూప్రాన్ మహంకాళి దేవాలయం ప్రాంగణంలోని శ్రీ సరస్వతీ సేవా సమితి ఉపాధ్యక్షులు జానకిరామ్ సీఆర్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీ సరస్వతీ సేవా సమితి ఉపాధ్యక్షులు జానకిరామ్ సిఆర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం మిఠాయిలు పంచి తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దర్శకత్వంలో మిలటరీ చర్య తీసుకోవాలని ఖాసిం రజ్వీ ని హెచ్చరించడం తో నిజాం నవాబుల పాలన నుంచి విముక్తి లభించగా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. 1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి పాలన అంతమై భారతదేశమంతటా స్వాతంత్ర్య సంబరాలు జరుపుకున్నారు. కానీ దేశం నడి బొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు ఆ అదృష్టం లేకుండా పోయింది. అప్పటి వరకూ బ్రిటిష్ వారికి సామంతుడిగా ఉన్న హైదరాబాద్ నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ తాను కూడా స్వతంత్రుడిని అయ్యానని ప్రకటించుకున్నాడు. హైదరాబాద్ అటు ఇండియాలో, ఇటు పాకిస్తాన్లో కలవదని స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించాడు. కానీ సంస్థానంలోని ప్రజలు తాము భారతదేశంలో కలవాలని కోరుకున్నారు. ఆనాటి హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ, మరాఠ్వాడా, కర్ణాటక ప్రాంతాల్లో ఇంకా ప్యూడల్ పాలన కొనసాగుతోంది. ఒకవైపు దేశ్ముఖ్, జాగీర్దార్, దొరల వెట్టి చాకిరిలో గ్రామీణ ప్రజానీకం మగ్గిపోతుంటే, మరోవైపు నిజాం అండతో రజాకార్లు చెలరేగిపోయారు.. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. గ్రామాలపై పడి ప్రజలను దోచుకొని, హత్యాకాండను కొనసాగించారు అని తెలిపారు. నిజాం ప్రోద్బలంతో రజాకార్ల నాయకుడు కాశీం రజ్వీ ఢిల్లీ ఎర్రకోటపై అసఫ్ జాహీ పతాకాన్ని ఎగురేస్తానని విర్ర వీగాడు. ఇలాంటి పరిస్థితిలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ, ఆర్యసమాజ్ తమ తమ మార్గాల్లో పోరాటాన్ని చేపట్టాయి. ఈ సంస్థలన్నింటినీ నిషేధించాడు ఉస్మాన్ అలీఖాన్. భారత దేశ నడిబొడ్డున క్యాన్సర్ కణితిలా మారిన హైదరాబాద్ సంస్థానంపై చర్య తీసుకోక తప్పదని నాటి హోం మంత్రి సర్దార్ వల్లభాయి పటేల్ నిర్ణయించుకున్నారు. పరిస్థితిని ముందే ఊహించిన నిజాం నవాబు పాకిస్తాన్ సాయం కోసం వర్తమానం పంపడంతో పాటు, ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో 1948 సెప్టెంబరు 13న భారత సైన్యం ఆపరేషన్ పోలో పేరిట హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది. దీనికి పోలీస్ యాక్షన్ అనే పేరు పెట్టారు. ఆ తర్వాత సెప్టెంబరు 17న నిజాం నవాబు లొంగుబాటు ప్రకటన చేశారు. ఈ విధంగా హైదరాబాద్ వాసులకు స్వాతంత్ర్యం వచ్చింది. హైదరాబాదు రాష్ట్రం ఏర్పడింది. అందుకే సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా పాటిస్తారనీ వివరించారు. ఈ కార్యక్రమంలో ఈసారం వెంకటేష్ గౌడ్, ఎపురి రాజు భయ్యా, స్వర్గం వెంకట నారాయణ, తాటి వెంకటేష్, గెంట్యాల నాగరాజు, వివేక్, మధు, శ్రీశైలం, బాలు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :