contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అక్ర‌మ‌మ‌ని తెలిసి అనుమ‌తులు ఎలా ఇస్తారు ? .. అధికారుల పై హైకోర్టు ఆగ్ర‌హం!

Telangana High Court : హైదరాబాద్ : అక్ర‌మ‌మ‌ని తెలిసి కూడా అనుమ‌తులు ఇచ్చి.. ఆ త‌ర్వాత అక్ర‌మ‌ నిర్మాణాలంటూ కూల్చివేయ‌డం ఏంట‌ని తెలంగాణ హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అలాంట‌ప్పుడు ఆ అనుమ‌తులు ఇచ్చిన అధికారులే న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుంద‌ని న్యాయ‌స్థానం ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. ఇక‌పై అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత‌ల విష‌యంలో వాటికి అనుమ‌తులు ఇచ్చిన అధికారుల ఆస్తుల జ‌ప్తుకు ఆదేశించాల్సి ఉంటుంద‌ని హైకోర్టు వ్యాఖ్యానించింది.

రంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని శంషాబాద్ మండ‌లం న‌ర్కుడ గ్రామంలోని మంగ‌ర్షి కుంట ఎఫ్‌టీఎల్, బ‌ఫ‌ర్ జోన్ ప‌రిధిలో ఉన్న నిర్మాణాల‌ను తొల‌గించాలంటూ ఇరిగేష‌న్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసుల‌ను స‌వాల్ చేస్తూ స‌చిన్ జైస్వాల్‌తో పాటు మ‌రో ఇద్ద‌రు హైకోర్టులో పిటిష‌న్ వేశారు.

ఈ పిటిష‌న్‌పై బుధ‌వారం జ‌స్టిస్ సీవీ భాస్క‌ర్‌రెడ్డి విచార‌ణ చేప‌ట్టారు. అనుమ‌తులు తీసుకుని నిర్మించుకున్న రేకుల ఇళ్ల‌ను కూల్చివేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని పిటిష‌నర్ త‌ర‌ఫు న్యాయ‌వాది వాద‌న‌లు వినిపించారు. ఈ మేర‌కు నీటిపారుద‌ల శాఖ అధికారి ఈ నెల 4న గోడ‌కు నోటీసులు అతికించిన‌ట్లు తెలిపారు.

ఏడు రోజుల్లోగా ఎఫ్‌టీఎల్, బ‌ఫ‌ర్ జోన్ ప‌రిధిలో ఉన్న నిర్మాణాల‌ను తొల‌గించాల‌ని అందులో పేర్కొన్నార‌న్నారు. తమ నిర్మాణాల విష‌యంలో అధికారులు జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాల‌ని న్యాయ‌వాది కోరారు. వాద‌న‌లు విన్న న్యాయ‌మూర్తి.. అనుమ‌తుల‌తో నిర్మించుకున్న ఇళ్ల‌ను కూల్చివేస్తామంటే ఎలాగ‌ని నిల‌దీశారు.

ఇరిగేష‌న్‌, మున్సిప‌ల్‌, పంచాయ‌తీ అధికారులు జీఓ 168 ప్ర‌కారం అనుమ‌తులు ఎందుకు ఇవ్వ‌ర‌ని ప్ర‌శ్నించారు. చెరువుల ప‌రిర‌క్ష‌ణ కోసం అక్ర‌మ నిర్మాణాల‌ను కూల్చివేయాలంటూ సుప్రీంకోర్టు కూడా ఉత్త‌ర్వులు ఇచ్చిన విష‌యాన్ని గుర్తు చేసిన న్యాయ‌మూర్తి.. అలాగ‌ని నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించ‌రాద‌ని చెప్పారు.

ఇరిగేష‌న్ అధికారులు జారీ చేసిన నోటీసుల‌పై పిటిష‌నర్లు 15 రోజుల్లోగా అన్ని ఆధారాలు, ప‌త్రాల‌తో స‌మాధానం ఇవ్వాల‌ని ఆదేశించారు. ఈలోగా నోటీసుల‌పై అధికారులు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని ఆదేశాలు జారీ చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :