తిరుమల శ్రీవారిని నిత్యం వేల మంది దర్శించుకుంటారు. సెలవులు, ప్రత్యేక పర్వదినాల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో సాధారణ భక్తులు దర్శనం కోసం గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. సులభంగా దర్శనం అయ్యేందుకు టీటీడీ ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. సంస్కరణలు తీసుకొచ్చింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుల తీరుపై కొంతకాలంగా విమర్శలు వ్యక్తమవుతున్నారు. వారు నిబంధనలు పాటించడంలేదనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని స్వయంగా టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా బయటపెట్టారు. ఇకపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
టీటీడీ బోర్డు మాజీ సభ్యులకు దర్శనం విషయంలో వెసులుబాటు ఉంది. వారు తల్లిదండ్రులు, భార్య, పిల్లలతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు. ఏడాదిలో పరిమితంగా కొన్నిసార్లు దర్శనభాగ్యం వారికి కల్పించారు. అయితే ఈ అవకాశాన్ని కొంతమంది టీటీడీ మాజీ బోర్డు సభ్యులు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు వ్యక్తమయ్యాయి. నిబంధనలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.
టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు కుటుంబ సభ్యులను కాకుండా ఇతరులను దర్శనానికి తీసుకొస్తున్నారని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. ఇలా రావడంపై అభ్యంతరం తెలిపారు. ఇకపై ఇలాంటి పనులు చేయవద్దని వారికి సూచించారు. కుటుంబ సభ్యులను కాకుండా ఇతరులను టీటీడీ దర్శనానికి తీసుకొస్తే వారిని అనుమతించబోమని తేల్చి చెప్పారు.