తిరుపతి తిరుమల కొండపై అన్యమత ప్రచారం, టీటీడీలో అన్యమత ఉద్యోగస్తుల విషయంలో చైర్మన్ బీఆర్ నాయుడు సీరియస్ గా స్పందించారు. టీటీడీ సంస్థలలో అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు వేశారు. టీటీడీ మహిళ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ అయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్, టీటీడీ అనుబంధ విద్యాసంస్థల్లోని లెక్చరర్లు, వసతి గృహ వార్డెన్లు, తదితరులు మొత్తం 18 మందిని బదిలీ చేశారు.
ఇటీవల తిరుమలలో మాంసాహారం దొరకడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. టీటీడీలో ఉన్నత స్థాయిలో అన్యమతాలకు చెందిన వారు ఉన్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కొండపై మాంసాహారం, గంజాయి, మద్యం దొరుకుతున్నాయని, దీనివల్ల తిరుమల క్షేత్రం పవిత్రత దెబ్బతింటోందని, అన్యమత ప్రచారం చాపకింద నీరులా విస్తరిస్తోందని భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది.
టీటీడీలో సంస్కరణలు మొదలు పెట్టింది. అన్యమత ప్రచారం చేస్తూ తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తున్న వారిని గుర్తించి 69 మందితో కూడిన ఓ జాబితాను టీటీడీ రూపొందించింది. వీరిలో టీటీడీ ఉద్యోగులతో పాటు రిటైర్ అయిన ఉద్యోగులు కూడా వున్నట్టు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గుర్తించారు. దీంతో ఉద్యోగులను బదిలీ చేయాలని నిర్ణయించారు. కాగా, టీటీడీలో ప్రస్తుతం మరో 300 మంది అన్యమతస్తులు వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్నట్లుగా సమాచారం.