- ఏప్రిల్ 28న వేద విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం
- టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి
తిరుపతి: దేశంలో యూజిసి గుర్తింపు ఉన్న ఏకైక వేద విశ్వవిద్యాలయమైన శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం సేవలు ఉత్తర భారత దేశంలోనూ విస్తరించాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఏప్రిల్ 28వ తేదీ వేద విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం నిర్వహించాలని నిర్ణయించామన్నారు . తిరుపతి శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో శుక్రవారం సాయంత్రం టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి అధ్యక్షతన వేద విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, హిందూ ధర్మప్రచార పరిషత్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలు నిర్వహించారు. అనంతరం చైర్మన్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. రుషికేష్ లో వేద విశ్వవిద్యాలయం సేవలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ఉన్న వేద పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు. వేద వర్సిటీలో పురాణ ప్రవచనం, యోగ, ధ్యానం అంశాల్లో ప్రత్యేకంగా సర్టిఫికెట్ కోర్సులు ప్రారంభించాలని నిర్ణయించినట్లు చైర్మన్ వివరించారు. కరోనా కారణంగా వర్శిటీలో నిలిపి వేసిన ఆదర్శ వేద గురుకుల విద్యను పునః ప్రారంభించనున్నామన్నారు. టీటీడీ ఉద్యోగుల లాగే వేదిక్ వర్సిటీ రెగ్యులర్ ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ అమలు చేయనున్నట్లు చెప్పారు. ఈ విద్యా సంవత్సరంలో 40 మంది విద్యార్థులకు పిహెచ్ డి ప్రవేశాలు కల్పించడానికి అనుమతించినట్లు ఆయన తెలిపారు. వర్సిటీ స్నాతకోత్సవం సందర్బంగా ఇద్దరికి మహా మహోపాధ్యాయ, ఇద్దరికి వాచస్పతి అవార్డులు ఇవ్వాలని కౌన్సిల్ సమావేశం నిర్ణయం తీసుకుందన్నారు. ప్రతి పౌర్ణమి రోజు తెలుగురాష్ట్రాలోని 59 ముఖ్య ఆలయాల్లో శ్రీసత్యనారాయణ స్వామి వ్రతం చేయాలని నిర్ణయించామన్నారు. అలాగే శ్రీనివాస వ్రతం ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్లు చైర్మన్ తెలిపారు. టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి, జేఈవో సదా భార్గవి, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ రాములు, మల్లేశ్వరి, వర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివ మూర్తి, సివి ఎస్వో నరసింహ కిషోర్, ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామింగ్ ఆఫీసర్ రాజగోపాల్, డిఈవో డాక్టర్ భాస్కర్ రెడ్డి, డిపిపి కార్యదర్శి శ్రీనివాసులు, ఈసీ సభ్యులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.